* అక్టోబర్ ఒకటి నుంచి రైల్వే కొత్త టైంటేబుల్
* రెండు కొత్త రైళ్లు ఏపీకే పరిమితం.. పలు రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రైల్వే శాఖ కొన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టింది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త సమయపట్టిక అమలులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కొత్త రైళ్ల వివరాలను వెల్లడించింది. కానీ ఇందులో తెలంగాణ మీదుగా వెళ్లే ఒక్క రైలూ లేకపోవటం విశేషం. దక్షిణ మధ్య రైల్వేకు రెండు కొత్త రైళ్లు ఇవ్వగా ఆ రెండూ ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమయ్యాయి. అలాగే వివిధ ప్రాంతాల నుంచి దక్షిణ మధ్య రైల్వే గుండా వెళ్లే మరికొన్ని రైళ్లను ప్రకటించగా అవీ ఏపీ మీదుగానే ప్రయాణించనుండటం విశేషం.
విజయవాడ-విశాఖపట్నం, తిరుపతి-జమ్మూతావి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లు కొత్తవి. భువనేశ్వర్-కృష్ణరాజపురం, హౌరా-యశ్వంతపూర్, కామాఖ్య-బెంగళూరు, సంత్రాగచ్చి-చెన్నై, హౌరా-ఎర్నాకులం, హాతియా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లు దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి వెళ్లేవే అయినా ... ఇందులో ఏవీ కూడా తెలంగాణకు రాకుం డానే ప్రయాణిస్తాయి. ఇటీవల రైల్వే మంత్రి సురేశ్ ప్రభు నగరానికి వచ్చినపుడు రైల్వేశాఖ అధికారులు యూపీఏ ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చి.. పట్టాలెక్కని 2 రైళ్లను ప్రారంభించేలా ఏర్పాటు చేశారు. ఇందులో కాజీపేట-ముంబై, సికింద్రాబాద్-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లు తెలంగాణ పరిధికి సంబంధించినవి కావటంతో ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టించుకోలేదు.
పలు రైళ్ల పొడిగింపు..
కాచిగూడ-చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి చెంగల్పట్టు వరకు వెళ్తుంది. నాందేడ్-పుణే ఎక్స్‌ప్రెస్ పన్వెల్ వరకు, కరీంనగర్-లింగంపేట-జగిత్యాల డెమూ రైలు మోర్తాడ్‌వరకు నడుస్తాయి. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (57254/ 57253-77292/77291), యశ్వంత పూర్- శ్రీమాతావైష్ణోదేవీ కట్రాఎక్స్‌ప్రెస్ (22679/ 22680- 82651/ 82652) నంబర్లు మారాయి. 111 రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. కాచిగూడ-రాయచూర్ (శనివారం నడవదు), రాయచూర్-గద్వాల (శనివారం నడవదు), గద్వాల-రాయచూర్ (సోమవారం ఉండదు), రాయచూర్-కాచిగూడ (సోమవారం ఉండదు) రైళ్లు నడవని రోజులను మార్చారు. 62 రైళ్ల వేగాన్ని పెంచి ప్రయాణ సమయాన్ని తగ్గించారు.
కొత్త రైళ్లలో రాష్ట్రానికి మొండిచేయి!
Published Fri, Sep 30 2016 1:23 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement