రాజ్‌భవన్ క్వార్టర్లకు శంకుస్థాపన
భూమి పూజలో పాల్గొన్న గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి గవర్నర్ నరసింహన్ దంపతులతో కలసి సీఎం కేసీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఉదయం 8.30 గంటలకు గవర్నర్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాజ్‌భవన్ వెనకనున్న విశాల స్థలంలో రూ.97.5 కోట్ల అంచనా వ్యయం తో ఈ నిర్మాణం చేపడుతున్నారు. క్వార్టర్లతో పాటు పాఠశాల భవనం, కమ్యూనిటీ హాల్, భద్రతా సిబ్బంది బ్యారెక్ పనుల కోసం గతేడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం పరిపాలనాపర అనుమతులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీలో ప్రాజెక్టు నమూనాను గవర్నర్, సీఎం తిలకించారు. ప్రాజెక్టు విశేషాల గురించి గవర్నర్ స్వయంగా సీఎంకు వివరించారు. రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, ఆర్ అండ్ బీ కమిషనర్ సునీల్‌శర్మ పాల్గొన్నారు.
మొత్తం 185 ఫ్లాట్‌లు...
రాజ్‌భవన్‌లో 1956లో నిర్మించిన ప్రస్తుత క్వార్టర్స్ శిథిలావస్థకు చేరాయి. వర్షా కాలంలో పైకప్పు నుంచి నీళ్లు కారుతుండడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సిబ్బంది కోసం కొత్త నివాస సముదాయానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం చేపట్టిన నూతన ప్రాజెక్టులో క్వార్టర్స్ తదితర భవనాలను 2,93,211 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సిబ్బంది వసతి కోసం జీ+5లో 185 ఫ్లాట్లను, 500 మంది విద్యార్థులకు సరిపోయేలా జీ+2తో పాఠశాల భవనం, 500 మంది సామర్థ్యంతో కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తున్నారు. ఒప్పందం మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ 6 లోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది.