ఇక విద్యలో రాష్ట్రాలకు ర్యాంకులు!
- కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కసరత్తు
- వచ్చే జూన్ నాటికి ర్యాంకులిచ్చేలా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: బోధన, సదుపాయాలు, నాణ్యత ప్రమాణాల ఆధారంగా యూనివర్సిటీలకు ర్యాంకులు ఇస్తున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ).. ఇక పాఠశాల విద్యా పరంగా రాష్ట్రాలకు ఇవ్వనుంది. రాష్ట్రాల్లోని పాఠశాల విద్యా స్థితిగతులు అంచనా వేసి వచ్చే జూన్ నాటికి ర్యాంకులను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందన్న ఉద్ధేశంతో ఎంహెచ్‌ఆర్‌డీ ముందుకు సాగుతోంది. నిధులను సద్వినియోగంతో పాటు ప్రయోగాలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించొచ్చని భావిస్తోంది. ఇందుకోసం నీతి ఆయోగ్, ఎంహెచ్‌ఆర్‌డీ 34 రకాల అంశాలతో స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ (ఎస్‌ఈక్యూఐ) రూపొందించేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
వాటి ఆధారంగానే ర్యాంకులు ఖరారు చేయనుంది. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాల్లో జిల్లా విద్యా సమాచార విధానంలో (డైస్ డాటా) ఇచ్చిన సమాచారం ఆధారంగా 2017 జూన్‌లో మొదటిసారి ర్యాంకులను ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ఏటా డైస్ డాటాను పరిశీలించి, శాంపిల్ సర్వే చేపట్టనుంది. వాటి ఆధారంగా ర్యాంకులివ్వడం.. నాణ్యత ప్రమాణాల కోసం ఆయా రాష్ట్రాల్లో ఆయా విభాగాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా ఎన్‌సీఈఆర్‌టీ సూచించనుంది. రాష్ట్రాలు సరైన సమాచారం ఇవ్వకపోతే ఎంహెచ్‌ఆర్‌డీ నేతృత్వంలో అత్యుత్తమ ప్రమాణాలు గల మరో సంస్థ ఆధ్వర్యంలో పరిస్థితి అంచనా వేయనుంది.