♦ కీలక ఫైళ్లపై చకచకా సంతకాలు...
♦ ఫిరాయించిన ఎమ్మెల్యే పైరవీలు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖ కమిషనర్ ఎస్‌ఎస్ రావత్ బదిలీ అయినప్పటికీ ఆ సీటును మాత్రం వదల్లేదు. బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆయన చాంబర్‌కు ఫైళ్లు రావడం, వాటిపై సంతకాలు పెట్టే బిజీలో ఆయన ఉండటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొంతమంది పారిశ్రామిక వేత్తలు వరుసగా వచ్చి పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసుకుంటున్నారని పరిశ్రమల శాఖలో గుసగుసలు విన్పిస్తున్నాయి. పరిశ్రమల రాయితీల గోల్‌మాల్‌పై విజిలెన్స్ విభాగం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విచారణ జరిగే వరకూ ఉన్నతాధికారులను దూరంగా ఉంచాలని కూడా అందులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న రావత్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు.
ఆ స్థానంలో సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించారు. కొత్త కమిషనర్ బుధవారం బాధ్యతలు స్వీకరించే వీలుంది. బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కీలకమైన ఫైళ్లపై ఎలాంటి సంతకాలు చేసినా వివాదాస్పదమయ్యే వీలుంది. అందువల్ల రావత్ పాత తేదీలతోనే సంతకాలు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రాయితీల కేసులో సస్పెండ్ అయిన అధికారులకు అనుకూలంగా ప్రభుత్వానికి నివేదిక పంపడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీలో చేరిన రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఏపీఎన్జీవో నేతలు రావత్‌ను కలవడం, ఆ తర్వాత సస్పెండ్ అయిన అధికారులపై అనుకూల నివేదికలు పంపడం, ఈ క్రమంలోనే కీలకమైన ఫైళ్లపై ఆయన సంతకాలు చేయడం పరిశ్రమల శాఖ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయమై రావత్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.