ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు ఉండాలి | Recall to right to representatives | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు ఉండాలి

Published Thu, Oct 6 2016 3:40 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు ఉండాలి - Sakshi

ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు ఉండాలి

గవర్నర్ నరసింహన్ వెల్లడి
లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి
తరచూ ఉప ఎన్నికలతో అభివృద్ధికి ఆటంకం
అక్రమాలపై ఏసీబీ చట్టం కింద విచారణ చేయాలి  
ఎన్నికల కమిషనర్ల సదస్సులో సూచనలు

 
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ అంశంపై పరిశీలన జరపాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే హక్కు(రైట్ టు రీకాల్)ను ఓటర్లకు కల్పించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ప్రధానంగా ఓటర్ల జాబితా నుంచి ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితాను వినియోగించడంతో పాటు ఓటర్లను ఆధార్‌కార్డుతో అనుసంధానం జరిపితే ఈ సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు. తరచూ ఉప ఎన్నికల నిర్వహణతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, ఏటా రెండు సార్లు.. జనవరి, జూలై నెలల్లో మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు.
 
 బుధవారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ల 24వ అఖిలభారత స్థాయి సదస్సులో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరముందన్నారు. పారదర్శకమైన ఎన్నికల నిర్వహణ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమని అన్నారు.
 
 అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి..
 ఎన్నికల్లో అక్రమాలు, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని గవర్నర్ అన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేం దుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని, ఎన్నికలు జరిగిన ప్రతిసారి పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయని, కొన్నాళ్లకు అందరూ దీన్ని మరిచిపోతున్నారన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం బలహీనంగా ఉండడంతో ఎన్నికల కేసులు నీరుగారిపోతున్నాయన్నారు.
 
 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణకు వీలు కల్పించేలా చట్ట సవరణ జరగాలన్నారు. నేర చరిత్ర గలవారు, కింది కోర్టుల్లో శిక్ష పడిన వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా చేయాలన్నారు. పోలింగ్‌కు 3 వారాల ముందే అభ్యర్థులు, వారి అనుచరులు ఆయా నియోజకవర్గాలను వదిలి వెళ్లాలని, కేవలం మీడియా ద్వారానే ప్రచారం చేసే విధంగా కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సూచించారు.
 
 వీటి వల్ల ఎన్నికల్లో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. ఎన్నికల సందర్భంగా తప్పుడు ఫిర్యాదులు చేసేవారిపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకాలు రాజకీయాలకు అతీతంగా జరగాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ రమాకాంత్‌రెడ్డి, ప్రస్తుత కమిషనర్ వి.నాగిరెడ్డి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహించారని గవర్నర్ ప్రశంసించారు. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నామని భారత ఎన్నికల సంఘం కమిషనర్ అచ్యుత్‌కుమార్ జ్యోతి తెలిపారు. కొత్త రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఢిల్లీ, ఛండీగఢ్‌ల ఎన్నికల అధికారి రాకేశ్ మెహతా, ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ ఎన్. రమేశ్ కుమారత్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement