ఉప్పులేటి కల్పన భర్తకు క్యాట్‌లో ఊరట
వర్ల రామయ్య ఫిర్యాదుతో ఆదాయపుపన్ను శాఖ ఇచ్చిన మెమో కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడమేమీ సర్వీసు నిబంధనలకు విరుద్ధం కాదని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) స్పష్టం చేసింది. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారనే కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన భర్త, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ ఉప్పులేటి దేవీప్రసాద్‌కు ఆదాయపన్ను శాఖ ఇచ్చిన చార్జి మెమోను క్యాట్ కొట్టివేసింది. ఈ మేరకు ఈ మేరకు క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, మిన్నీ మ్యాథ్యూలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది.
రాజకీయ కారణాలతో తనకు చార్జిమెమో దాఖలు చేశారంటూ దేవిప్రసాద్ క్యాట్‌ను ఆశ్రయించారు. టీడీపీ నాయకుడు వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చార్జి మెమో దాఖలు చేయడాన్ని క్యాట్ తప్పుబట్టింది. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి తన భార్య కల్పన ప్రత్యర్థిగా వర్ల రామయ్య పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి చెందిన అభ్యర్థులు తనపై తప్పుడు ఫిర్యాదులు చేశారని దేవీప్రసాద్ క్యాట్‌కు నివేదించారు. ఆయన వాదనలు విన్న ధర్మాసనం చార్జి మెమోను కొట్టివేసింది.