నా జోలికొస్తే మీ బండారం బయట పెడతా
- డిసెంబర్లోనే రాజీనామా చేశా
- రాజీనామా కాపీని జేబులో పెట్టుకుని తిరుగుతున్నా
- మంత్రి తలసాని వెల్లడి
హైదరాబాద్: ‘గత డిసెంబర్‌లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశా.. ఆ కాపీని జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నా... ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి రెడీగా ఉన్నా’ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలోని ‘డి’ బ్లాక్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాపీని ఆయన విలేకరులకు చూపించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నానని, భయపడే వాడినే అయితే ఎమ్మెల్సీ పదవి అడిగి ఉండేవాడినని తలసాని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచే తప్పుకుంటానని, ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇందుకు సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని టీడీపీ, కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ నా జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టను.. అందరి బండారం బయటపెడతా.. భూములు కొట్టేసిన దొంగలా నా గురించి మాట్లాడేది. ఒకసారి మీ చరిత్ర తెలుసుకోండి’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నరసింహులును టీడీపీలో ఎందుకు చేర్చుకున్నారని, ఆయనపై ఏం యాక్షన్ తీసుకున్నారని ప్రశ్నించారు.
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు ఎస్పీవై రెడ్డి, కొత్తపల్లి గీతలను టీడీపీలో చేర్చుకోలేదా? అని నిలదీశారు. ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, జూపూడి ప్రభాకర్, చైతన్య వర్మ, తిప్పేస్వామి ఇప్పుడు టీడీపీలో లేరా? అన్నారు. నాపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసే ముందు వాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరి ఉంటే బాగుండేది. ఆ పార్టీకి అక్కడో నీతి, ఇక్కడో నీతా?’ అంటూ తలసాని మండిపడ్డారు. గండ్ర వెంకటరమణారెడ్డి ముందుగా ఆయన చరిత్ర తెలుసుకోవాలన్నారు. వైఎస్ వద్దకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు నాడు మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ఎందుకు ప్రశ్నించలేదని ఆరోపించారు. ఇలాంటి నాయకులు ఈ రోజు నీతులు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి కావాలనే టీఆర్‌ఎస్‌లో చేరానని, స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తారని తలసాని పేర్కొన్నారు.