అసమర్థత కప్పిపుచ్చుకోవడానికే అవార్డుల వెంట పరుగు
కేసీఆర్ కుటుంబంపై రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సీఎం కేసీఆర్ కుటుంబం అవార్డుల వెంట పరుగులు పెడుతున్నదని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రాజారాం యాదవ్, మధుసూదన్‌రెడ్డితో కలసి సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని, రైతుల రుణమాఫీ చేస్తానని మోసం చేసిన కేసీఆర్‌కు వ్యవసాయ నాయకత్వ అవార్డు వచ్చిందన్నారు.
కేసీఆర్ కూతురు, ఎంపీ కవితకు నారీ ప్రతిభా పురస్కార్ అవార్డు, కొడుకు కేటీఆర్‌కు ఐటీ అవార్డు వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప రాష్ట్ర మంత్రివర్గంలో మరెవరూ పనిచేయడంలేదా అని రేవంత్ ప్రశ్నించారు. సన్మానాలు చేయడానికి, అవార్డులు ఇవ్వడానికి, దండలు వేయడానికి, చప్పట్లు కొట్టడానికి ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేటు వసూలు చేసే సంస్థలు ఇచ్చే అవార్డులకు విలువ ఏముంటుందన్నారు.
టీఆర్‌ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయని రేవంత్ అన్నారు. ఆర్మూరులో దళితునిపైకి టిప్పర్ ఎక్కించి, కానిస్టేబుల్ శిక్షణ కోసం వెళ్లిన ఇద్దరు విద్యార్థినులను అత్యాచారం చేసి చంపించారన్నారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి నడిబజారులో నడిపిం చారని, నేరెళ్లలో ఇసుకమాఫియాను ప్రశ్నించిన వారిని లారీలతో గుద్దించి చంపారని, పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. మానకొండూరులో ఇద్దరు దళిత యువకులు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. దీనికి కారణమైన టీఆర్‌ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని, 10 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.