రూ.1,500 కోట్ల భూ కుంభకోణం
వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వెల్లడి
సాక్షి,హైదరాబాద్: విశాఖపట్నం దసపల్లాహిల్స్‌లో రూ.1,500 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని వైఎస్‌ఆర్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాధ్ పేర్కొన్నారు. విశాఖలోని ‘రాణి కుమలదేవి’ ప్రభుత్వ భూమిని సీఎం తనయుడు లోకేశ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో అమర్నాథ్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కోర్టు వివాదంలో ఉన్న సర్వే నం.1196లోని 18.38 ఎకరాల భూమికి సంబంధించి లోకేశ్ తన బినామీలతో 52 దొంగ డాక్యుమెంట్లను సృష్టించారు.
ఈ భూమిలో రెండు వేల గజాలను టీడీపీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి గతంలో చంద్రబాబు జీవో 556 విడుదల చేశారు. గత ఏప్రిల్‌లో లోకేశ్ కార్యాలయానికి శంకుస్ధాపన చేశారు. ఈ భూమి ప్రభుత్వ భూమిగా అప్పటి కలెక్టర్ యువరాజ్ ధృవీకరించారు . అయితే వాటి పత్రాలు ప్రభుత్వం దగ్గర లేవని చెప్పడం సిగ్గుచేటు. నారా లోకేశ్ షాడో సీఎంగా తయారయ్యారు. ఆయన దృష్టంతా రాష్ట్రంలోని విలువైన భూములు, అవినీతి మూటలపైనే ఉంది. విశాఖ భూముల విషయంలో బాబు, లోకేశ్ చేస్తున్న ఆరాచకాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాం. ఈ భూమిని కాపాడుకోవడానికి అవసరమైతే సుప్రీం కోర్టులో పిల్ వేస్తాం.’ అని అమర్నాధ్ తెలిపారు.