
ఎంఎంటీఎస్-2కు రూ.20.83 కోట్లు
బడ్జెట్‌లో కేటాయింపులతో పనులు వేగిరమయ్యే అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశకు బడ్జెట్‌లో రూ.20.83 కోట్లు కేటాయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు అప్పటి రాష్ట్రప్రభుత్వం గతేడాది రూ.190 కోట్లు కేటాయించింది. తాజాగా మరోసారి కేటాయించిన రూ.20.83 కోట్ల నిధులతో రాష్ట్రం ఇప్పటి వరకు రూ.210.83 కోట్లు కేటాయించినట్లయింది. రేల్వేశాఖ తన వాటా కింద గత బడ్జెట్‌లో రూ.99 కోట్ల నిధులు అందజేసింది. మొత్తం రూ.648 కోట్ల అంచనాలతో రూపొందించిన రెండో దశ ప్రాజెక్టు కోసం రాష్ట్రం 2/3 వంతు, రైల్వేశాఖ 1/4 వంతు చొప్పున నిధులు అందజేయవలసి ఉంటుంది.
ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన నిధులతో వివిధ మార్గాల్లో పనులు ప్రారంభమయ్యాయి. 10 కిలోమీటర్‌లు ఉన్న పటాన్‌చెరు-తెల్లాపూర్ రైలు మార్గం పునరుద్ధరణ పనులను చేపట్టారు. అలాగే సికింద్రాబాద్ నుంచి బొల్లారం వరకు ఉన్న 15 కి.మీ లైన్ ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు కూడా మొదలయ్యాయి. ఆ మార్గంలో కొన్ని కొత్త రైల్వేస్టేషన్‌లను నిర్మించడంతో పాటు, ప్లాట్‌ఫామ్‌ల ఎత్తు పెంచడం, అదనపు షెడ్‌లు ఏర్పాటు చేయడం వంటి రీమోడలింగ్ పనులు చేపట్టారు. గత సంవత్సరం టెండర్లను ఆహ్వానించిన అధికారులు ఈ ఏడాది నిర్మాణ పనులను ప్రారంభించారు. దశలవారీగా 2016-17 నాటికి రెండో దశ పూర్తి చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం.
రవాణా రంగానికి బాగానే ఇచ్చారు
మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్ ఫర్వాలేదు. ప్లానింగ్ కోసం నిధులు బాగా కేటాయించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. రవాణా రంగానికి సంబంధించి నిధులు బాగానే కేటాయించారు. తెలంగాణలో కొత్త బస్సుల కోసం రూ.345 కోట్ల మేరకు కేటాయించడం సంతోషదాయకం. మెట్రోరైలుకు రూ.436 కోట్లు కేటాయించి ప్రభుత్వం మెట్రో రైలుకు తాను ఇస్తోన్న ప్రాధాన్యతను చాటింది. ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులను రూ.కోటి నుంచి రూ.కోటిన్నరకు పెంచడం పట్ల మాత్రం భిన్నాభిప్రాయం ఉంది. ఈ నిధులు సక్రమంగా వినియోగించేందుకు సరైన మార్గదర్శకాలను రూపొందించాలి.
-పద్మనాభరెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి