- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోటా రెట్టింపు
- ఇన్‌చార్జి మంత్రుల ప్రమేయం తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గాల అభివృద్ధి నిధిని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ పథకం కింద ఒక్కో నియోజకవర్గానికి ఏడాదికి రూ.1.50 కోట్ల చొప్పున నిధులు మంజూరవుతుండగా, ఇప్పటి నుంచి రూ.3 కోట్ల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య గురువారం ఉత్తర్వులిచ్చారు. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచే పెంచిన మొత్తం అమల్లోకి వస్తుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పథకం (సీడీపీ) పేరుతో ఈ పథకం అమలవుతోంది.
తమ నియోజకవర్గాల పరిధిలోని ప్రజల విజ్ఞప్తుల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు, పనులు చేపట్టేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎమ్మెల్యేలతో పాటు సగం నిధులకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఆమోదించి పంపేలా నిబంధన ఉండేది. అయితే ఇన్‌చార్జి మంత్రుల ప్రమేయాన్ని ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా తొలగించింది. నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద ఇచ్చే రూ.3 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించే బాధ్యతను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే అప్పగించింది. వారు పంపే ప్రతిపాదనలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటికి అనుమతివ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.