
పదేళ్లలో రూ.53,547 కోట్లు..!
రాజధాని నిర్మాణానికి బడ్జెట్ లెక్కలు తేల్చిన సీఆర్‌డీఏ
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,550 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : నూతన రాజధాని నిర్మాణానికి వచ్చే పదేళ్లలో రూ.53,547.67 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి(సీఆర్‌డీఏ) లెక్కకట్టింది. భూసమీకరణతోపాటు అమరావతి సిటీలో, సీడ్‌కేపిటల్‌లో, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణానికి ఏడాదికి అవసరమయ్యే నిధులు, వచ్చే పదేళ్లల్లో ఏ ఏడాది ఎన్ని నిధులు అవసరమనే అంచనాలను సీఆర్‌డీఏ రూపొందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీఆర్‌డీఏ పరిపాలన తదితర అవసరాల కోసం రూ.171.56 కోట్ల బడ్జెట్ అవసరమని అంచనా వేశారు.
ఉద్యోగుల జీతభత్యాలతోపాటు పలు రంగాల్లో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసేందుకు ఈ మొత్తం అవసరమని సీఆర్‌డీఏ పేర్కొంది. ప్రభుత్వ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి రూ.3,560 కోట్లు అవసరం అవుతుందని సీఆర్‌డీఏ అంచనా వేసింది. గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు రూ.541 కోట్లు, సీడ్ కేపిటల్‌లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.4,641.94 కోట్లు, అమరావతి సీటీలో మౌలిక వసతుల కల్పనకు రూ.28,711.56 కోట్లు, ల్యాండ్‌పూలింగ్ స్కీము అమలుకు రూ.15,921.61 కోట్లు అవరమని సీఆర్‌డీఏ అంచనా వేసింది.