ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు
♦ బస్సు ప్రమాదంలో మరణించిన మెడికోల కుటుంబాలకు పరిహారం
♦ సీడీఎస్ నిధుల నుంచి చెల్లించనున్నట్టు డీఎంఈ వెల్లడి
హైదరాబాద్: ఇటీవల బస్సు ప్రమాదంలో మృతిచెందిన నలుగురు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ కాలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ(సీడీఎస్) నిధుల నుంచి రూ.7 లక్షల చొప్పున పరిహారంగా అందజేయాలని నిర్ణయిం చినట్టు తెలంగాణ డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), సీడీఎస్ చైర్మన్ డాక్టర్ రమణి వెల్లడించారు. విద్యార్థుల వరుస ఆందోళనలతో స్పందించిన డీఎంఈ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉస్మానియా వైద్య కళాశాలలో జరిగిన సీడీఎస్ సమావేశంలో డీఎంఈతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్, ప్రొఫెసర్లు డాక్టర్ బాబూరావు, డాక్టర్ నాగేందర్, సిబ్బంది, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
సమావేశం ఆనంతరం డీఎంఈ రమణి మాట్లాడుతూ ఈ నెల 14న జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థులు జి.లక్ష్మణ్, మోకా విజయ్‌తేజ, మచ్చ ప్రణయ్‌రాజారాం, వదనాల ఉదయ్ కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించామన్నారు. సీడీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి, ముఖ్యకార్యదర్శి తివారీ దృష్టికి తీసుకువెళ్లి మంగళవారం సాయంత్రంలోగా విద్యార్థుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తామని చెప్పారు. ఉస్మానియా వైద్య కళాశాలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది ఒకరోజు వేతనాలను విరాళంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. గాంధీ వైద్య కళాశాల, కాకతీయ వైద్య కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకొచ్చారన్నారు. వచ్చే ఏడాది నుంచి కళాశాల టాపర్స్‌కు మృతిచెందిన విద్యార్థుల పేరు మీద గోల్డ్ మెడల్స్ అంజేస్తామని ప్రకటించారు. కాగా, ఉస్మానియా వైద్య కళాశాల ఎస్‌పీఎం హెచ్‌వోడీ డాక్టర్ బాబూరావు విద్యార్థుల కుటుంబాలకు తన వంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించి చెక్కును కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్‌కు అందజేశారు. డీఎంఈ రమణి కూడా రూ.10 వేల విరాళాన్ని ప్రకటించారు.
కొనసాగిన విద్యార్థుల ఆందోళన..
బస్సు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కోఠి ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగింది. విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. తరగతి గదులకు తాళాలు వేసి కళాశాల ప్రధాన ద్వారం వద్ద మృతిచెందిన విద్యార్థుల చిత్రపటాలను పెట్టి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. సీడీఎస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డీఎంఈ రమణి విద్యార్థులకు స్వయంగా వివరించడంతో వారు తమ నిరసన విరమించారు.