రహదారులకు రూ.ఐదున్నర వేల కోట్లు
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్మాణానికి రూ.ఐదున్నర వేల కోట్ల వరకు అవసరమవుతాయని రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్‌లోని న్యాక్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతోపాటు గత సంవత్సరం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు.
పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒప్పందం మేరకు పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని, అలసత్వం ప్రదర్శించే అధికారులను కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే పనులకు సంబంధించి డీపీఆర్‌లు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. వాటిని కేంద్రానికి పంపితే అనుమతులు వస్తాయని, ఆ వెంటనే పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.