Department of Buildings
-
24 అంతస్తులతో.. 18 నెలల్లో..అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రంగం సిద్ధమైంది. వరంగల్‌లోని పాత సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ భారీ ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ తాజాగా ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించింది. టెండర్లు దాఖలు చేసిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 15న నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిన వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. సింగిల్ టెండర్లో రూ.1,100 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టే రోడ్లు, భవనాల శాఖ చేపట్టే అతిపెద్ద ప్రాజెక్టు కావడం విశేషం. ఇప్పటివరకు రోడ్లు, వంతెనలు, భవనాలు.. ఇలా ఏ కేటగిరీలో చూసినా అంత మొత్తంతో కూడిన సింగిల్ టెండర్ ప్రాజె క్టును ఆ శాఖ చేపట్టలేదు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి లోపాలు లేకుండా గడువులోగా చేసి చూపాలని అధికారులు భావిస్తున్నారు. ఒప్పందం కుదిరిన నాటి నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 సెప్టెంబర్ ఆఖరుకల్లా ఆసుపత్రి భవనం అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. 24 అంతస్తులతో.. ఇటీవల ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలి సిందే. ఆరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భాగంగా వరంగల్‌లో చేపట్టేదే అతి పెద్దది. మిగతా ఐదు వేయి పడకలతో కూడినవి కాగా, వరంగల్ ఆసుపత్రి మాత్రం 1,750 పడకలతో నిర్మించను న్నారు. ఇప్పటికే పాత జైలు భవనాన్ని కూల్చి చదును చేశారు. 60 ఎకరాల సువిశాల స్థలంలో 24 అంతస్తులతో నిర్మిస్తారు. ఇక్కడ 16.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం అందు బాటులోకి రానుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో లేన ట్టుగా మొత్తం 34 విభాగాలతో కూడిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇక్కడ రూపుదిద్దుకోనుంది. ఇందుకు మంచి ఎలివేషన్‌తో కూడిన డిజైన్‌ను సిద్ధం చేశారు. మూడు బ్లాకులుగా ఉండే ఈ భవనం ముందు భారీ పచ్చిక మైదానం, విశాలమైన ఫౌంటెయిన్ ఏర్పాటు చేస్తారు. నిమ్స్ విస్తరణ ఇప్పటివరకు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనమే రాష్ట్రంలో పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ప్లాన్ చేయగా, మరోవైపు ఏకంగా 2 వేల పడకలతో నిమ్స్ ఆసుపత్రి విస్తరణ ప్రాజెక్టును కూడా రోడ్లు, భవనాల శాఖ చేపట్టనుంది. దీనికి సంబంధించి ప్లాన్లను సిద్ధం చేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న నిమ్స్ ఆసుపత్రి భవనానికి అనుబంధంగా ఈ నిర్మాణం జరగనుంది. ఇందుకు పక్కనే ఉన్న ఎర్రమంజిల్ క్వార్టర్స్ కాలనీని ఎంపిక చేశారు. దాదాపు 19 ఎకరాల్లో విస్తరించిన ఆ కాలనీ మొత్తాన్ని తొలగించి అక్కడ భారీ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అక్కడున్న దాదాపు 300 క్వార్టర్స్‌ను ఇప్పటికే ఖాళీ చేయగా, త్వరలో వాటిని కూల్చనున్నారు. -
రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: రహదారుల నిర్మాణాలకు సంబంధించి అధికార యంత్రాంగం సమన్వయం తో పనిచేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 181 రహదారుల నిర్మాణం.. వాటి అనుమతుల వేగవంతంపై అటవీ, రోడ్లు, భవనాల శాఖల అధికారుల సమన్వయ సమావేశం శనివారం అరణ్యభవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆమె అధికారులకు వివిధ అంశాలపై స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్ర పరిధిలో పూర్తి స్థాయి రోడ్ నెట్ వర్క్, కొత్త జాతీయ రహదారులు, వ్యూహాత్మక ఎలివేటెడ్ రోడ్ కారిడార్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. అన్ని రకాల అనుమతుల సాధన కోసం డెడ్ లైన్లు పెట్టుకుని పనిచేయాలని, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం జిల్లా స్థాయి అధికార యంత్రాంగంతో భూ సేకరణ విషయమై సమన్వయం చేసుకోవాలని రెండు శాఖల అధికారులను ఆదేశించారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ ) ఆర్.శోభ మాట్లాడుతూ ఆయా రహదారులకు అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించేందుకు సంబంధిత పనులు చేస్తున్న ఏజెన్సీలు కూడా సహకరించాలని కోరారు. అటవీ, పర్యావరణ అనుమతులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కఠిన నిబంధనలను అర్థం చేసుకుని, అం దుకు అనుగుణంగా అనుమతుల పత్రాలను ఆన్లైన్లో పొందు పర్చాలని అన్నారు. రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాస రాజు మాట్లా డుతూ హైవేల నిర్మాణానికి వీలైనన్ని నిధు లు రాబట్టుకొనే ప్రయత్నం చేయాలని చెప్పారు. సమావేశంలో పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్త్రీ) ఆర్.ఎం. దోబ్రి యల్, అటవీశాఖ సంయుక్త కార్యదర్శి ప్రశాంతి, ఆర్.అండ్.బీ ప్రత్యేకకార్యదర్శి బి.విజయేంద్ర, సల హాదారు గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లోనూ టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతుల జారీ కోసం అమలు చేస్తున్న ‘టీఎస్–బీపాస్’విధానాన్ని ఇకపై గ్రామ పంచాయతీల పరిధిలోనూ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో అక్రమ, అనధికార లేఅవుట్లు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనకు రావడంతో, వాటిని కఠినంగా నియంత్రించడానికి ఈ విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామ పంచాయతీల్లో కొత్త లేఅవుట్ల అనుమతులు టీఎస్–బీపాస్ ద్వారానే జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌ను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఇటీవల మెమో జారీ చేశారు. పంచాయతీల్లో లేఅవుట్ల అనుమతులకు ప్రస్తుతం అమలు చేస్తున్న డీపీఎంఎస్, ఈ–పంచాయతీ విధానాన్ని టీఎస్–బీపాస్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జాప్యం చేసే అధికారులపై జరిమానాలు టీఎస్–బీపాస్ విధానం కింద భవనాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, ఇతర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయని అధికారులపై జరిమానాలు విధించనున్నారు. జరిమానాల విధింపు త్వరలోనే అమల్లోకి రానున్నట్లు పురపాలక శాఖ టీఎస్–బీపాస్ పోర్టల్‌లో ప్రకటించింది. అక్రమ లేఅవుట్లకు 2 నెలల సమయం టీఎస్–బీపాస్ చట్టం మేరకు లేఅవుట్ల అనుమతులకు వచ్చే ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా లేఅవుట్ కమిటీ ముందు పెడతారు. ఈ కమిటీ సిఫారసుల మేరకు సంబంధిత గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పేరు మీద అనుమతులు జారీ చేయనున్నారు. పల్లె, పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న అక్రమ లేఅవుట్లపై జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్ (డీటీఎఫ్) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఏర్పాటైన అక్రమ లేఅవుట్లకు నోటీసులు జారీ చేసి టీఎస్–బీఎస్ కింద రెండు నెలల్లోగా క్రమబద్ధీకరణ/అనుమతులు తీసుకునేలా ఆదేశించాలని, విఫలమైన పక్షంలో చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అక్రమ లేఅవుట్ల తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్లను కోరింది. -
అక్టోబర్ నుంచి చెల్లింపులు లేవు..
నాన్‌ప్లానింగ్ పనులకైతే ఎనిమిది నెలలుగా.. గుత్తేదార్ల అసోసియేషన్ సమాలోచనలు? పనులు ఆపిన కాంట్రాక్టర్లకు శ్రీముఖాలు ఆర్అండ్బీ శాఖలో అయోమయం నిజామాబాద్ : రహదారులు, భవనాల శాఖ(ఆర్అండ్బీ)లో అయోమయం నెలకొంది. రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో ఎనిమిది నెలలుగా జాప్యం జరుగుతుండగా, మరోవైపు పనులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదార్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో పనుల కొనసాగింపుపై గుత్తేదార్లు సమాలోచనలో పడినట్లు సమాచారం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 1,971 కిలోమీటర్లు ఆర్అండ్బీ శాఖ రహదారులున్నాయి. ఇందులో 236 కి.మీ. రాష్ట్ర రహదారులు కాగా, 854 కి.మీ. జిల్లా రహదారులు ఉన్నాయి. మరో 881 కి.మీ. గ్రామీణ, ఇతర రహదారులున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి ఉన్న రహదారులను డబుల్‌లైన్ రోడ్లుగా, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఉన్న రహదారులను నాలుగులైన్ రోడ్లుగా విస్తరించాలని నిర్ణయించిన విషయం విధితమే. ఇలా జీఓ నంబర్ 129 కింద సుమారు రూ.238 కోట్లు, జీఒ నంబర్ 130 కింద సుమారు రూ.533 కోట్లు మంజూరయ్యాయి. కానీ.. ఈ నిధులతో చేపట్టిన పలు పనులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి. అక్టోబర్ నుంచి ఈ బిల్లులు రాకపోవడంతో పనులు కొనసాగించేందుకు గుత్తేదార్లు సమాలోచనలో పడినట్లు సమాచారం. ఎనిమిది నెలలుగా.. ఇక నాన్‌ప్లాన్ (ప్రణాళికేతర) పద్దు కింద చేపట్టిన పనులకైతే ఎనిమిది నెలలుగా బిల్లులు నిలిచిపోయినట్లు ఆర్అండ్బీ వర్గాలు పేర్కొంటున్నాయి. నాన్‌ప్లాన్ కింద రహదారుల నిర్వహణ పనులు చేపడతారు. బీటీ రెన్యూవల్స్, ప్యాచ్‌వర్క్‌లు చేస్తుంటారు. ఈ పనులకైతే ఎనిమిది నెలలుగా బిల్లులు నిలిచిపోయినట్లు సమాచారం. ఇలా పిరియాడికల్ రెన్యూవల్స్ కింద నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 76 పనులు కొనసాగుతున్నాయి. వీటిలో కొన్ని పనులు పూర్తి కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. గుత్తేదార్లకు శ్రీముఖాలు.. మరోవైపు పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న గుత్తేదార్లకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాకు పెద్ద ఎత్తున రహదారుల పనులు మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు పోటీ పడి పనులు దక్కించుకున్నారు. కానీ.. పనులు చేయడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. కొన్ని రోడ్లయితే నెల రోజులకు పైగా పనులు కుంటుపడటంతో అధికారులు సదరు గుత్తేదార్లకు నోటీసులు జారీ చేశారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం చేసిన ఐదుగురు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశామని రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ మధుసూధన్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
రహదారులకు రూ.ఐదున్నర వేల కోట్లు
అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్మాణానికి రూ.ఐదున్నర వేల కోట్ల వరకు అవసరమవుతాయని రోడ్లు, భవనాల శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు ప్రతిపాదించాలని నిర్ణయించింది. ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం హైదరాబాద్‌లోని న్యాక్‌లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతోపాటు గత సంవత్సరం ప్రారంభించిన రోడ్లు, వంతెనల పనుల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. పనులను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ఒప్పందం మేరకు పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవని, అలసత్వం ప్రదర్శించే అధికారులను కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే పనులకు సంబంధించి డీపీఆర్‌లు వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. వాటిని కేంద్రానికి పంపితే అనుమతులు వస్తాయని, ఆ వెంటనే పనులు మొదలుపెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.