శబరిలో దళారులు
రిజర్వేషన్ కేంద్రాల్లో తిష్ట
అయ్యప్ప భక్తులకు దొరకని రైలు టికెట్లు
బ్లాక్‌లో రెట్టింపు ధరలకు విక్రయం
అక్రమార్కులకు అధికారులు, సిబ్బంది సహకారం
సిటీబ్యూరో: శబరి ఎక్స్‌ప్రెస్‌లో దళారులు పడ్డారు. శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తులను దోచేస్తున్నారు. బుకింగ్ కేంద్రాల్లో తిష్టవేసి టికెట్లను ఎగరేసుకుపోతున్నారు. ఉదయం బుకింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్లు బుక్ అయిపోతున్నాయి. ముందుగా కొనుగోలుచేసిన టికెట్లను భక్తులకు రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్లే సుమారు రెండు లక్షల మంది భక్తులకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే అందుబాటులో ఉండడం దళారులకు వరమైంది. రైల్వే అధికారులు, బుకింగ్ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా దందా కొనసాగుతోంది. బుకింగ్ కేంద్రాల వద్ద అక్రమాలను అరికట్టాల్సిన నిఘా నీడలోనే ఈ వ్యవహారం సాగుతుండడం గమనార్హం. నవంబర్ 16 నుంచి జనవరి 16 వరకు అయ్యప్ప ఆలయం తెరిచి ఉంటుంది.
సీజన్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు నగరం నుంచి శబరిమలైకి వెళ్తుంటారు. ఇక్కడి నుంచి శబరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే కొట్టాయం వెళుతుంది. ఈ రైలుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ రైలు టికెట్ల కోసం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్‌లతో పాటు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఇతర రిజర్వేషన్ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేస్తున్నారు. ఉదయం 8 గంటలకు టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది. రెండు నిమిషాల వ్యవధిలోనే అడ్వాన్స్ టికెట్లను కొనుగోలు చేస్తున్నారు. క్షణాల్లో వెయిటింగ్ లిస్ట్ 150 నుంచి 180కి చేరుతుండడంతో భక్తులు నివ్వెరపోతున్నారు. గంటల తరబడి పడిగాపులు కాసినా టికెట్ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైల్వే అధికారులు, ఉద్యోగుల సాయంతో ఈ అక్రమ వ్యవహారం సాగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వేషన్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు పదే పదే చెబుతుండగా... ఆ నిఘా నీడలోనే ఏజెంట్‌లు, వారి అనుచరులు, దళారులు యథేచ్ఛగా టికెట్లు ఎగరేసుకుపోవడం గమనార్హం. వీటిని భక్తులకురెట్టింపు చార్జీలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొట్టాయంకు స్లీపర్ క్లాస్ చార్జీ రూ.575. దళారులు బహిరంగంగా రూ.1200కు విక్రయిస్తున్నారు. డిసెంబర్ వరకు శబరి ఎక్స్‌ప్రెస్ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరిపోయింది.
జాడలేని ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప సీజన్ ప్రారంభమైనా దక్షిణ మధ్య రైల్వే ఇంతవరకూ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయలేదు. చివరి క్షణాల్లో హడావిడిగా ప్రత్యేక రైళ్లను వేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం కంటే... రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందే వీటిని ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఏటా 2 లక్షల మందికిపైగా భక్తులు శబరికి వెళ్తారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా.