హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీమ్కు సహకరించిన ఘరానా నాయకులు, అధికారులను విచారించకుండా శిక్షించకుండా నేరసామ్రాజ్యాన్ని కూల్చేశామని ప్రభుత్వం ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నయీం హత్యలు, దందాలు, కబ్జాల్లో పాలుపంచుకున్న నేరస్తుల పేర్లను బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నయీమ్ వంటి నరహంతకుణ్ని చేరదీసి చివరి వరకు ఆశ్రయం కల్పించి అవసరం తీరాక హత్య చేశారని ఆరోపించారు. దీనిని ఎన్‌కౌంటర్‌గా పోలీసులు పేర్కొనటం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. నయీమ్ను సజీవంగా పట్టుకుని ఉంటే అతని పాపాల్లో పాలకులు, పోలీసులు, జర్నలిస్టులకు ఎంత భాగముందనేది వెల్లడి అయ్యేదని చెప్పారు. నయీమ్ను అడ్డుపెట్టుకుని నాయకులు, పాలకులు, పోలీసులు ఎన్ని దురాగతాలకు పాల్పడ్డారనేది ప్రజలకు తెలిసి ఉండేదని సాదినేని వెల్లడించారు.