సదర్..అదుర్స్
దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నారాయణగూడలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదర్ వేడుకులు అదుర్స్ అన్పించాయి. నిఘనిఘలాడే నలుపుతో ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా నిలిచిన దున్నపోతులు ఠీవీగా నడుస్తుండగా...వాటి ముందు ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు చేస్తూ కళాకారులు, యువతీ యువకులు అలరించారు. డప్పు దరువులు, ఆటపాటలు.. దున్నపోతుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. బాజాభజంత్రీల నడుమ అందంగా అలంకరించిన దున్నపోతులతో వాటి యజమానులు ర్యాలీగా నారాయణగూడకు చేరుకున్నారు.
యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనానికి గ్రేటర్ హైదరాబాద్ నుండే కాకుండా మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా దున్నపోతులను అలంకరించి తీసుకువచ్చారు. సదర్ వ్యవస్థాపకులు మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు రెడ్డి కాలేజ్ రోడ్డులో భారీ స్వాగత వేదికను ఏర్పాటు చేశారు.
- కాచిగూడ