సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం! | Saharanpur in the early 'Fierce' meeting! | Sakshi
Sakshi News home page

సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!

Published Thu, Feb 11 2016 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

సహరన్‌పూర్‌లో  తొలి ‘ఉగ్ర’ సమావేశం!

సహరన్‌పూర్‌లో తొలి ‘ఉగ్ర’ సమావేశం!

‘జునూద్’ ఏర్పడ్డాక ఇదే మొదటి మీటింగ్
గతేడాది జనవరిలో నిర్వహించిన ముదబ్బీర్
హైదరాబాద్ నుంచి వెళ్లి పాల్గొన్న నఫీస్ ఖాన్
సమాచార మార్పిడికి రెండు యాప్స్ వినియోగం

 
సిటీబ్యూరో: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా ఏర్పడిన ‘జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్’ తొలి సమావేశం ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మాడ్యుల్‌కు సంబంధించి హైదరాబాద్‌లో అరెస్టయిన నలుగురినీ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఢిల్లీ యూనిట్ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సిటీలో చిక్కిన నలుగురిలో నఫీస్ ఖాన్ అత్యంత కీలకమైన ఉగ్రవాదిగా అధికారులు నిర్థారించారు. సిరియా కేంద్రంగా అన్సార్ ఉల్ తౌహిద్ సంస్థను ఏర్పాటు చేసి, ఐసిస్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న షఫీ ఆర్మర్ అలియాస్ యూసుఫ్ హింద్ (కర్ణాటకలోని భత్కల్ వాసి) ఆదేశాలతోనే ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఫేస్‌బుక్ ద్వారా ఇతడికి పరిచయమైన ముంబై వాసి ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రిజ్వాన్ అలియాస్ ఖాలిద్‌లకు ‘జునూద్’ విస్తరణ బాధ్యతల్ని అప్పగించాడు.
 
సహరన్‌పూర్‌లో మీటింగ్...

ఈ మాడ్యుల్‌కు చీఫ్‌గా వ్యవహరించిన ముదబ్బీర్ ఆన్‌లైన్ ద్వారానే ‘జునూద్’ను విస్తరించాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌కు చెందిన నఫీస్ ఖాన్‌తో 2014లో పరిచయం ఏర్పడింది. అబు జరార్ పేరుతో మాడ్యుల్‌లో చేరి, చాకచక్యంగా వ్యవహరిస్తున్న నఫీజ్ ఖాన్‌ను ఈ మాడ్యుల్ ఆర్థిక లావాదేవీలు పర్యవేక్షించే ఫైనాన్స్ చీఫ్‌గా ముదబ్బీర్ నియమించాడు. మాడ్యుల్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో ముదబ్బీర్ గతేడాది జనవరిలో యూపీలోని సహరన్‌పూర్‌లో తొలి సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పట్లో అక్కడ మత ఘర్షణలు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మీటింగ్ కోసం ఎంచుకున్నారు. ఇందులో పాల్గొన్న ఐదుగురిలో నఫీస్ ఖాన్ అలియాస్ అబు జరార్ కూడా ఉన్నాడు. వాస్తవానికి ఈ సమావేశంలోనే మాడ్యుల్‌లోని ప్రతి ఒక్కరికీ ప్రాంతాల వారీగా ‘ఉగ్రబాధ్యతలు’ అప్పగించాలని భావించారు. అయితే షఫీ ఆర్మర్ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వాయిదా వేసుకున్నారు. ఈ సమావేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాతే నఫీస్ నగరానికి చెందిన ఒబేదుల్లా ఖాన్, మహ్మద్ షరీఫ్ మొహియుద్దీన్, అబు అన్స్‌లను ఉగ్రవాదబాట పట్టించాడు. ఈ మాడ్యుల్ సహరన్‌పూర్‌తో పాటు హైదరాబాద్, లక్నో, టమ్కూర్‌లో పలుమార్లు సమావేశమైందని, క్యాడర్‌కు ఆయుధాల వినియోగం, పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి బెంగళూరు, టమ్కూరు, లక్నోల్లోని అటవీ ప్రాంతాల్లో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కుట్రపన్నిందని ఎన్‌ఐఏ గుర్తించింది.
 
నిఘాకు దొరకని యాప్స్‌తో...
ముష్కరమూకల వినియోగం పెరిగిన నేపథ్యంలో నిఘా వర్గాలు ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్‌మీడియాలపై కన్నేసి ఉంచుతున్నాయి. దీన్ని పసిగట్టిన ‘జునూద్’ మాడ్యుల్ సమాచార మార్పిడికి కొత్త యాప్స్‌ను వినియోగించింది. అంతగా ప్రాచుర్యంలోకి రాని ఆడ్రాయిడ్ యాప్స్ ‘ట్రిలియన్’, ‘సురిస్పోట్’లను తమ సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకుని వ్యవహారాలు కొనసాగించామని ఎన్‌ఐఏ అధికారులకు ఉగ్రవాదులు వెల్లడించారు. ‘జునూద్’ కార్యకలాపాలను విస్తరించే ప్రయత్నాల్లో ఉన్న ముదబ్బీర్ ముంబైతో పాటు ఢిల్లీ, గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, అలహాబాద్, ఉత్తరాఖండ్, ఆజామ్‌ఘర్ ప్రాంతాల్లో మీడియా వింగ్స్ ఏర్పాటుకు నిర్ణయించారు. దీనికోసం ఆయా ప్రాంతాల్లో విద్యాధికుల్ని, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని ఎంచుకునే పనిలో ఉండగానే ఈ మాడ్యుల్ గుట్టురట్టయింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement