హైదరాబాద్: సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ అందజేస్తున్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సహా పలువురు అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్‌మెంట్-ఎన్జీవో, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్, ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను సాక్షి అందజేస్తోంది. వీటితోపాటు సినిమా విభాగంలో కూడా పది పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తోంది.
తొలిసారి 2014 సంవత్సరానికి ఎక్సలెన్స్ అవార్డులను 2015 మే 16న సాక్షి ప్రదానం చేసింది. అదేవిధంగా 2015 సంవత్సరానికి గాను ఈ రోజు ప్రదానం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది.