Excellence Awards
-
12 మంది ఐఏఎస్‌లకు ఎక్సలెన్స్ అవార్డులు
పంద్రాగస్టు వేడుకల్లో పురస్కారాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 12 మంది ఐఏఎస్ అధికారులు, వారి బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటించింది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రభుత్వం అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేయనుంది. మూడు కేటగిరీల్లో ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. వినూత్న కార్యక్రమాల అమలు, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు, పనితీరు కేటగిరీల్లో వ్యక్తిగత, గ్రూపు, సంస్థలుగా అవార్డులను నిర్ణయించింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శాలిని మిశ్రా ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వినూత్న కార్యక్రమాలు: 1. ఎ.దేవసేన–జనగాం కలెక్టర్ (ప్రభుత్వ పాఠశాలల బాలికలకు మార్షల్ ఆర్ట్స్, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాలు) 2.జ్యోతి బుద్ధ ప్రకాశ్–ఆదిలాబాద్ కలెక్టర్, ఐఏఎస్‌లు ఆర్వీ కర్ణన్, అనురాగ్ జయంతి (ఉట్నూర్ ఐటీడీఏలో స్టార్–30 కార్యక్రమం) 3. టి.చిరంజీవులు–హెచ్ఎండీఏ కమిషనర్, హెచ్ఎండీఏ (డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) జనరల్: 1.డి.యోగితారాణా–నిజామాబాద్ కలెక్టర్ (మానవతా సదన్, హెచ్ఐవీ బాధిత పిల్లల పునరావాస ప్రాజెక్టు) 2. ఏ.మురళి–భూపాలపల్లి కలెక్టర్, డీఎంహెచ్‌వో అప్పయ్య, ములుగు–గోపాల్, చిట్యాల–రవి ప్రవీణ్‌రెడ్డి, ఏటూరునాగారం–అపర్ణ, మహదేవ్పూర్–వాసుదేవరెడ్డి (జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కల్పించడం) 3. డాక్టర్ శరత్–జగిత్యాల కలెక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ విభాగం (ధాన్యం సేకరణ) ప్రతిష్టాత్మక కార్యక్రమాలు: 1. మిషన్ భగీరథ: వెంకట్రామరెడ్డి–సిద్దిపేట కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ విభాగం 2. మిషన్ కాకతీయ: రాజీవ్‌గాంధీ హన్మంతు–భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఇరిగేషన్ విభాగం 3. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్: జ్యోతి బుద్ధ ప్రకాశ్–ఆదిలాబాద్ కలెక్టర్, కె.కృష్ణారెడ్డి–జాయింట్ కలెక్టర్, సీహెచ్.సూర్యనారాయణ–ఆర్డీవో, ఆర్.అర వింద్‌కుమార్–సూపరింటెండెంట్ 4.హరితహారం: సురేంద్రమోహన్–సూర్యాపేట కలెక్టర్ 5. హరితహారం: ప్రస్థాన్ జె.పాటిల్–వరంగల్ రూరల్ కలెక్టర్ 6. ఆరోగ్యలక్ష్మి: గౌరవ్ ఉప్పల్–నల్లగొండ కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ విభాగం. -
కళాతపస్వికి సాక్షి జీవన సాఫల్య పురస్కారం
భారతీయ సంగీతానికి వెండితెరపై కె.విశ్వనాథ్ తొడిగిన బంగారు కంకణం..‘శంకరాభరణం’. పాశ్చాత్య సంగీతానికి ఆదరణ పెరుగుతున్న రోజుల్లో శంకరశాస్త్రి అనే ఒక పాత్రకు యాభై ఏళ్ల వ్యక్తిని హీరోగా పెట్టి.. భారతీయ సంగీత విలక్షణతను చాటే ఒక సినిమా తీయడం ఆ రోజుల్లో పెద్ద సాహసం. కానీ, దర్శకుడు కె. విశ్వనాథ్‌కు అది నమ్మకం. తన పట్ల, తను ప్రాణంగా ప్రేమించే సంగీతం పట్ల ఉన్న నమ్మకం. ఆ చిత్రం వెండితెరపై చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచ వేదికలపై ఊరేగించింది. అప్పటి వరకు కె.విశ్వనాథ్ అంటే ప్రేక్షకులకు అభిమానం. ‘శంకరాభరణం’ తర్వాత ఆ అభిమానం గౌరవంగా కూడా మారింది. ‘స్వాతిముత్యం’తో ఆస్కార్ ఎంట్రీ హీరోను బట్టి సినిమాకు వెళ్లే రోజుల్లో.. ఇది కె.విశ్వనాథ్ సినిమా అంటూ థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులను సంపాదించుకున్నారు ఆయన. ‘స్వాతిముత్యం’తో తెలుగు సినిమాకు ఆస్కార్ ఎంట్రీ తెచ్చిపెట్టిన ఘనత ఆయన సొంతం. పాటను తన సినిమాకు ఊపిరిగా భావించే ఈ విశ్వనాథుడు.. వేటూరి, సిరివెన్నెల వంటి గొప్ప సాహితీ శిఖరాలను సినిమా రంగానికి పరిచయం చేశారు. చూపులేని హీరో, మాటలు రాని హీరోయిన్‌తో వెండితెరపై ఈ కళాతపస్వి సృష్టించిన దృశ్యకావ్యం.. ‘సిరివెన్నెల’.. మరో అద్భుతం. ఎంత గొప్ప దర్శకుడో అంత గొప్ప నటుడు కథకు కావలసిన నటుల్ని ఎంచుకుని, ఏరుకుని కథే హీరోగా సినిమాలు చేసిన గొప్ప దర్శకులు కె.విశ్వనాథ్. కమలహాసన్ చేపలు పట్టే జాలరిగా కనిపించినా, చిరంజీవి చెప్పులు కుట్టే పాత్ర చేసినా.. అది ఆ దర్శకుని మీద ఉన్న నమ్మకం, గౌరవం తప్ప ఇంకోటి కాదు. స్టార్ హీరోలుగా తిరుగులేని ఇమేజ్ ఉన్నవాళ్లు కూడా కె.విశ్వనాథ్ డెరైక్షన్‌లో ఒక్క పాత్రయినా చేయకపోతే తమ జీవితానికి లోటుగా భావించే స్థాయికి ఎదిగిన గొప్ప దర్శకులు ఆయన. పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు కాంబినేషన్లో ఎన్నో క్లాసిక్స్ అందించిన కె.విశ్వనాథ్.. హిందీ చిత్ర పరిశ్రమలో కూడా తన మార్కు చూపించారు. ‘శుభసంకల్పం’ చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన తర్వాత ఈ కళాతపస్వి ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయారు. ఉన్నతమైన విలువలు ఉన్న పాత్రల్లో చాలా సహజంగా నటించి.. ఎన్నో చిత్రాల్లో పతాక సన్నివేశాలకు ప్రాణం పోశారు కె.విశ్వనాథ్. అవార్డులకే నిండుదనం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఐదు చిత్రాలు జాతీయ అవార్డులు గెలుచుకున్నాయి. డెరైక్టర్‌గా, నటుడిగా మొత్తం నాలుగు నందులు అందుకున్న విశ్వనాథ్‌ను పది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. అదే ఏడాది భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో గౌరవించింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా ఈ కళాతపస్విని డాక్టరేట్‌తో సత్కరించుకుంది. -
అద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ అది: దాసరి
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు సాక్షి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రావడంపై దర్శకుడు దాసరి నారాయణరావు హర్షం వ్యక్తంచేశారు. కె.విశ్వనాథ్ గారిని గౌరవించడమంటే మా దర్శకులందర్నీ గౌరవించడం అన్నారు. మాది యాబై ఏళ్ల అనుబంధమని, ఆరోగ్యకరమైన పోటీపడే మనస్తత్వంతో సినిమాలు తీసేవారిమని చెప్పారు. ఆయన సినిమాలు తాను చూసేవాడినని, తన సినిమాలు విశ్వనాథ్ గారు చూసి విమర్శలు చేసుకునేవాళ్లమని పేర్కొన్నారు. విశ్వనాథ్ గారు చేసిన సినిమాలలో అత్యద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ 'శంకరాభరణం' అని దాసరి నారాయణరావు అన్నారు. ఆ మూవీ తర్వాత ఆయన తన స్థాయికి తగ్గకుండా కేవలం కళ కోసమే తపిస్తూ ఆ తరహా చిత్రాలు చేశారని ప్రశంసించారు. ఈ విధంగా నిరంతం శ్రమించేవారిని సత్కరిస్తున్నందుకు సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి గారిని కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు అభినందించారు. దర్శకులను ఆయన హీరో చేశారు: సిరివెన్నెల 'సిరివెన్నెల'తో తనకు ఇండస్ట్రీలో జన్మినిచ్చారని సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిలో చూసేది భౌతికనేత్రం కాదు మనోనేత్రమని తాను పాటలు రాసిన తొలి సినిమాతోనే చెప్పించారని ప్రశంసించారు. -
డైరెక్టర్ విశ్వనాథ్ కు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు
హైదరాబాద్: ప్రముఖ సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును నేడు ఆయనకు ప్రధానంచేశారు. సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో ఈరోజు మొట్టమొదటి అవార్డు అందుకున్న అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య, ఓ చేతిలో బిడ్డతో వచ్చి అవార్డు తీసుకోవడం కన్నా తనకు మంచి సీన్స్ ఎక్కడ దొరుకుతాయని కె.విశ్వనాథ్ గారు అభిప్రాయపడ్డారు. వృత్తిగా చేయవలసిన బాధ్యతతో మూవీలు చేశామని పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఎంతో మంది తెలివైనవాళ్లున్నారని, వారికి తాను మెరుగులు దిద్దలేదని సొంతంగా వారే ఎదిగారని అన్నారు. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు. -
మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారు
హైదరాబాద్: మంచి పని చేస్తే ప్రతి ఒక్కరూ సహకరిస్తారని అనంతపురం జిల్లా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ మాంచూ ఫెర్రర్ అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఫెర్రర్ సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఫెర్రర్ మాట్లాడుతూ.. రాయలసీమ వంటి ఫ్యాక్షన్ ఏరియాలో సేవా సంస్ధ నిర్వహిస్తుండటం గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, రాజ్‌దీప్ సర్దేశాయ్, ఏబీకే ప్రసాద్, శాంతా సిన్హా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
'సాక్షి గ్రూపు సహకారం మరువలేనిది'
హైదరాబాద్: సాక్షి గ్రూపు సహకారం మరువలేనిదని సాక్షి ఎక్సలెన్స్ యంగ్ అచీవర్-ఎడ్యుకేషన్ అవార్డుకు ఎంపికైన నైనా జెశ్వాల్ అంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో ఆమె ఈ అవార్డును స్వీకరించింది. ఈ సందర్భంగా నైనా మాట్లాడుతూ.. తల్లిదండ్రులే తనకు ప్రత్యక్షదైవమని, సాక్షి ప్రోత్సాహకాన్ని మరువలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో తొలుత సిపాయి ముస్తాక్ అహ్మద్‌కు మరణానంతర అవార్డును ప్రకటించారు. సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఈ అవార్డును ముస్తాక్ అహ్మద్ భార్యకు అందజేశారు. యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డును సోనీవుడ్ నూతలపాటి అందుకున్నారు. సాక్షి మీడియా అందించిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని సోనీవుడ్ నూతలపాటి అన్నారు. తన తల్లిదండ్రుల మార్గమే సేవాగుణం నేర్పిందని, సేవా కార్యక్రమాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ అందజేస్తున్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 సంవత్సరానికి గాను ఈ రోజు అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. -
'మోస్ట్ పాపులర్ హీరో'గా మహేష్ బాబు
హైదరాబాద్: సాక్షి ఎక్సలెన్స్ అవార్డులలో మోస్ట్ పాపులర్ హీరోగా మహేష్ బాబు, లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుకు సినీ దర్శకుడు విశ్వనాథ్ ఎంపికయ్యారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా 2015 సంవత్సరానికి గాను అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి ప్రారంభించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సహా పలువురు అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎడ్యుకేషన్, సోషల్ డెవలప్మెంట్-ఎన్జీవో, హెల్త్‌కేర్, ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను సాక్షి గ్రూపు అందజేస్తోంది. వీటితోపాటు సినిమా విభాగంలో కూడా పది పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తోంది. సాక్షి ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతలు: లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు- సినీనటుడు విశ్వనాథ్ మోస్ట్ పాపులర్ హీరో- మహేష్ బాబు మోస్ట్ పాపులర్ డైరెక్టర్- గుణశేఖర్ మోస్ట్ పాపులర్ హీరోయిన్- రకుల్ ప్రీత్ సింగ్ మోస్ట్ పాపులర్ సినిమా- శ్రీమంతుడు మోస్ట్ పాపులర్ పాటల రచయిత- సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానంతర అవార్డు- సిపాయి ముస్తాక్ అహ్మద్ యంగ్ అచీవర్ అవార్డు- ఎడ్యూకేషన్- నైనా జైశ్వాల్ జ్యురీ స్పెషల్ అవార్డు- కంచె మోస్ట్ పాపులర్ మేల్ సింగర్- కారుణ్య మోస్ట్ పాపులర్ ఫిమేల్ సింగర్- సత్యయామిని యంగ్ అచీవర్- సోషల్ సర్వీస్- సోనీవుడ్ నుతలపాటి యంగ్ అచీవర్-స్టోర్ట్స్- కిదాంబి శ్రీకాంత్ యంగ్ అచీవర్ మహిళా స్పోర్ట్స్- జ్యోతి సురేఖ తెలుగు ఎన్నారై అవార్డు- బి.టి. సింగిరెడ్డి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్-రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్- మాంచూ ఫెర్రర్(అనంతపురం) తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్- డీఆర్డీవో- సతీష్ రెడ్డి (సైంటిస్ట్) ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అవార్డు- పద్మనాభరెడ్డి -
వైభవంగా సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం
హైదరాబాద్: సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ అందజేస్తున్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ సహా పలువురు అతిథులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్-ఎన్జీవో, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్, ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను సాక్షి అందజేస్తోంది. వీటితోపాటు సినిమా విభాగంలో కూడా పది పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తోంది. తొలిసారి 2014 సంవత్సరానికి ఎక్సలెన్స్ అవార్డులను 2015 మే 16న సాక్షి ప్రదానం చేసింది. అదేవిధంగా 2015 సంవత్సరానికి గాను ఈ రోజు ప్రదానం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేసింది. -
‘సాక్షి’ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం నేడే
సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డులు’ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేస్తూ వస్తోంది. ఇది కేవలం ప్రతిభకు సత్కారం మాత్రమే కాదు. ముందు తరాల ఔత్సాహికులకు ఒక స్ఫూర్తి కూడా. తొలిసారి 2014 సంవత్సరానికి ఎక్సలెన్స్ అవార్డులను 2015 మే 16న సాక్షి ప్రదానం చేసింది. అదేవిధంగా 2015 సంవత్సరానికి గాను నేటి సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్లో అవార్డులను బహుకరిస్తోంది. ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ జీవిత సాఫల్య పురస్కారం అందుకుంటారు. అలాగే సుప్రసిద్ధులైన న్యాయ నిర్ణేతలు ఎంపిక చేసిన పలు రంగాల్లోని ప్రముఖులు, నిష్ణాతులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్లతో సహా పలువురు అతిథులు ఈ వేడుకకు హాజరవుతారు. ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్-ఎన్జీవో, ఎక్సలెన్స్ ఇన్ హెల్త్‌కేర్, ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-లార్జ్ స్కేల్, బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-స్మాల్/మీడియం స్కేల్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-ఎడ్యుకేషన్, యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్-సోషల్ సర్వీస్ వంటి పలు విభాగాల్లో ఈ అవార్డులను సాక్షి అందజేస్తోంది. వీటితోపాటు సినిమా విభాగంలో కూడా పది పాపులర్ అవార్డులు ప్రదానం చేస్తోంది. సమాజాన్ని చైతన్యవంతం చేసేందుకు, ముందు తరాల వారికి స్ఫూర్తినిచ్చేందుకు పాటుపడుతున్నవారి మార్గదర్శకత్వంలో మెరుగైన రేపటి దిశగా ముందడుగు వేయడమే సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల లక్ష్యం.. ధ్యేయం. సాక్షి! సత్యమేవ జయతే సాక్షి! రేపటికి ముందడుగు సాక్షి! ప్రతిభకు పట్టం -
ఘనంగా ‘సుధీక్షణ్’ అవార్డుల ప్రదానం
విజయవాడ : ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఐదు రంగాలలో విశేష కృషి చేసిన నిష్ణాతులకు చిగురుపాటి సుధీక్షణ్ ఫౌండేషన్ వారు ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, అగ్రికల్చరల్ సైన్స్ విభాగంలో మండవ జానకీరామయ్య, కల్చరల్ అండ్ లిటరేచర్ విభాగంలో ఆనంద్ కూచిభొట్ల(యూఎస్ఏ), విద్యారంగంలో జ్యోత్స్న రాఘవాచారి, సామాజిక సేవా విభాగంలో జి.రస్మి సమరానికి అవార్డులు అందజేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన కృష్ణా జిల్లాను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. సుధీక్షణ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అవార్డు గ్రహీత త్రిపురనేని హనుమాన్‌చౌదరి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు చవుదుకోవాలని, విద్యతో అసమానతలు తొలగిపోతాయని చెప్పారు. అనంతరం 15 మంది వికలాంగ బాలలకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సీహెచ్ విమల, ఐఈఐ చైర్మన్ పి.రవీంద్రబాబు, కేసీపీ సీఈవో జి.వెంకటేశ్వరరావు, కృష్ణా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి జి.వి.రామారావు, విశ్రాంత వైద్యుడు అశోక్ సూర్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.