'సాక్షి గ్రూపు సహకారం మరువలేనిది'
హైదరాబాద్: సాక్షి గ్రూపు సహకారం మరువలేనిదని సాక్షి ఎక్సలెన్స్ యంగ్ అచీవర్-ఎడ్యుకేషన్ అవార్డుకు ఎంపికైన నైనా జెశ్వాల్ అంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఆమె ఈ అవార్డును స్వీకరించింది. ఈ సందర్భంగా నైనా మాట్లాడుతూ.. తల్లిదండ్రులే తనకు ప్రత్యక్షదైవమని, సాక్షి ప్రోత్సాహకాన్ని మరువలేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో తొలుత సిపాయి ముస్తాక్ అహ్మద్కు మరణానంతర అవార్డును ప్రకటించారు. సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి, ప్రఖ్యాత జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్.. ఈ అవార్డును ముస్తాక్ అహ్మద్ భార్యకు అందజేశారు. యంగ్ అచీవర్-సోషల్ సర్వీసు అవార్డును సోనీవుడ్ నూతలపాటి అందుకున్నారు. సాక్షి మీడియా అందించిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని సోనీవుడ్ నూతలపాటి అన్నారు. తన తల్లిదండ్రుల మార్గమే సేవాగుణం నేర్పిందని, సేవా కార్యక్రమాల్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు పలు రంగాల్లో కృషి చేస్తున్న వారిని గుర్తించి సత్కరించే లక్ష్యంతో సాక్షి సంస్థ అందజేస్తున్న సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. ఆదివారం సాయంత్రం సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 సంవత్సరానికి గాను ఈ రోజు అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ప్రముఖులతో కూడిన జ్యూరీ ద్వారా అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు.