హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ కు సాక్షి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు రావడంపై దర్శకుడు దాసరి నారాయణరావు హర్షం వ్యక్తంచేశారు. కె.విశ్వనాథ్ గారిని గౌరవించడమంటే మా దర్శకులందర్నీ గౌరవించడం అన్నారు. మాది యాబై ఏళ్ల అనుబంధమని, ఆరోగ్యకరమైన పోటీపడే మనస్తత్వంతో సినిమాలు తీసేవారిమని చెప్పారు. ఆయన సినిమాలు తాను చూసేవాడినని, తన సినిమాలు విశ్వనాథ్ గారు చూసి విమర్శలు చేసుకునేవాళ్లమని పేర్కొన్నారు.
విశ్వనాథ్ గారు చేసిన సినిమాలలో అత్యద్భుత క్లైమాక్స్ ఉన్న మూవీ 'శంకరాభరణం' అని దాసరి నారాయణరావు అన్నారు. ఆ మూవీ తర్వాత ఆయన తన స్థాయికి తగ్గకుండా కేవలం కళ కోసమే తపిస్తూ ఆ తరహా చిత్రాలు చేశారని ప్రశంసించారు. ఈ విధంగా నిరంతం శ్రమించేవారిని సత్కరిస్తున్నందుకు సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి గారిని కేంద్ర మాజీ మంత్రి, దర్శకుడు దాసరి నారాయణరావు అభినందించారు.
దర్శకులను ఆయన హీరో చేశారు: సిరివెన్నెల
'సిరివెన్నెల'తో తనకు ఇండస్ట్రీలో జన్మినిచ్చారని సినీ గేయ రచయిత సీతారామశాస్త్రి, సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. సృష్టిలో చూసేది భౌతికనేత్రం కాదు మనోనేత్రమని తాను పాటలు రాసిన తొలి సినిమాతోనే చెప్పించారని ప్రశంసించారు.