విజయవాడ : ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా ఐదు రంగాలలో విశేష కృషి చేసిన నిష్ణాతులకు చిగురుపాటి సుధీక్షణ్ ఫౌండేషన్ వారు ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రదానం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు డాక్టర్ త్రిపురనేని హనుమాన్‌చౌదరి, అగ్రికల్చరల్ సైన్స్ విభాగంలో మండవ జానకీరామయ్య, కల్చరల్ అండ్ లిటరేచర్ విభాగంలో ఆనంద్ కూచిభొట్ల(యూఎస్‌ఏ), విద్యారంగంలో జ్యోత్స్న రాఘవాచారి, సామాజిక సేవా విభాగంలో జి.రస్మి సమరానికి అవార్డులు అందజేశారు.
సిద్ధార్థ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన కృష్ణా జిల్లాను అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. సుధీక్షణ్ ఫౌండేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆమె కొనియాడారు. నగర మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
అవార్డు గ్రహీత త్రిపురనేని హనుమాన్‌చౌదరి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు చవుదుకోవాలని, విద్యతో అసమానతలు తొలగిపోతాయని చెప్పారు. అనంతరం 15 మంది వికలాంగ బాలలకు వీల్ చైర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుధీక్షణ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సీహెచ్ విమల, ఐఈఐ చైర్మన్ పి.రవీంద్రబాబు, కేసీపీ సీఈవో జి.వెంకటేశ్వరరావు, కృష్ణా ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి జి.వి.రామారావు, విశ్రాంత వైద్యుడు అశోక్ సూర్య, మాధవి తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ‘సుధీక్షణ్’ అవార్డుల ప్రదానం
Published Wed, Aug 20 2014 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 12:07 PM
Advertisement
Advertisement