
సెంటిమెంట్ కాదు... డెవలప్‌మెంట్
నాయిని నర్సింహారెడ్డి.. సామ్యవాదాన్ని ఎంచుకున్న సొక్కం తెలంగాణ వాది. ముక్కుసూటి తనం, మాయామర్మం లేని భోళాతనం ఆయనకు ఆభరణం. నగర రాజకీయాలతో ఆయనది ఐదు దశాబ్దాల విడదీయలేని అనుబంధం. టి.అంజయ్య, సంజీవరెడ్డి లాంటి ఉద్దండుల్ని మట్టి కరిపించి చట్టసభలకు ఎన్నికైన నాయిని ప్రస్తుతం టీ క్యాబినెట్‌లో హోంమంత్రిగా, నగర ఇన్‌చార్జి మంత్రిగా... నగర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. ఏడుపదులు దాటిన వయసులోనూ గల్లీ గల్లీ తిరుగుతూ అభివృద్ధి చేసే పార్టీనే గెలిపించమని కోరుతున్నారు.
ప్రస్తుతం తాము సెంటిమెంట్ కాకుండా..డెవలప్‌మెంట్ నినాదంతో ముందుకు వెళుతున్నామని, చెప్పిన మాటను నెరవేర్చకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్లే అడగమని తేల్చి చెబుతున్న నాయినితో...
సాక్షి ఇంటర్వ్యూ
- సాక్షి ప్రతినిధి, హైదరాబాద్
... ఇప్పుడు ఇదే మా నినాదం
* విశ్వ నగర ఆవిష్కరణే సీఎం ఏకైక లక్ష్యం
* అన్ని విధాలుగా అర్హులకే టికెట్లు ఇచ్చాం
* 100కు పైగా సీట్లు సాధిస్తాం
* టీడీపీ, బీజేపీతోనే మా పోటీ..
* హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 స్థానాలు గెలువబోతున్నారా.. ఎలా సాధ్యం?
అవును..ఢంకా భజాయించి చెబుతున్నా.. 100 స్థానాల్లో గెలువబోతున్నాం. నేను 1962 నుండి నగర రాజకీయాల్లో ఉన్నా.. ఏ ప్రభుత్వం ఇంతగా ప్రభావితం చేసిన సందర్భాలు లేవు. సీఎంగా కేసీఆర్ ఉద్యమ సమయంలో తన దృష్టికి వచ్చిన అనుభవాలను ప్రత్యేక పథకాలుగా మార్చి జనంలోకి తీసుకువెళుతున్నారు. కేసీఆర్ చెప్పింది.. వాస్తవమేనని -అవన్నీ అమలు సాధ్యమేనని ప్రజలు నేడు విశ్వసిస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ అమలు చేసి చూపిస్తున్నాం.
ముఖ్యంగా వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500, గూడులేని వాళ్లకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, వచ్చే మూడేళ్లలో 24 గంటల మంచినీటి సరఫరా, నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ, వ్యక్తిగత భద్రతకు అత్యంత ప్రాధాన్యం, అన్ని మతాలు, కులాలకు గౌరవం ఇచ్చాం. దీంతో నగర ప్రజలంతా ఈ ఎన్నికల్లో పార్టీ రహితంగా టీఆర్‌ఎస్ కు ఓటేయాలని నిర్ణయించారు. అందుకే 100పైగా స్థానాల్లో గెలువబోతున్నాం.
అభ్యర్థుల ఎంపికలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదని, ఫిరాయింపుదారులకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని ఆరోపణలు వస్తున్నాయి కదా..!
అందులో వాస్తవం లేదు. టీ ఉద్యమంలో ఉన్న వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నం. అర్హులైన ఉద్యమకారులందరికీ సీట్లు ఇచ్చాం. ముఖ్యంగా సర్వేల ఆధారంగా అన్ని కులాలు, మతాలను సమతూకం చేస్తూ టికెట్లు ఇచ్చాం. ఒకటి అరా చోట్ల కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వక తప్పలేదు. అక్కడి స్థానిక పరిస్థితుల మేరకు సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఓ పద్ధతి ప్రకారం ఎంపిక చేశాం. ఎవరైనా ఉద్యమకారులకు న్యాయం జరగకపోతే వారి సేవలను వేరే రూపంలో వాడుకుంటాం.
ప్రచార తీరు ఎలా ఉంది.. మంత్రులంతా పాల్గొంటున్నారు.. మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు?
అవును మేం చేసింది..చేయబోయే కార్యక్రమాల గురించి మరింత వివరంగా ప్రజలకు వివరించేందుకు మంత్రులు ఆయా నియోజకవర్గాలకు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల సమస్యలను స్వయంగా మంత్రులే పరిశీలిస్తున్నారు. ఎన్నికల అనంతరం వారే వాటి పరిష్కారానికి చొరవ చూపనున్నారు. ప్రచారంలో మా స్పీడును ఎవరూ అందుకోలేరు. మా అభ్యర్థులను గెలిపించాలని కాలనీలు, బస్తీలు ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మా ప్రధాన ప్రత్యర్థి టీడీపీ-బీజేపీ కూటమికి మెజారిటీ చోట్ల డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు.
సీమాంధ్రులు ఎవరి వైపున్నారు.. కేటీఆర్ క్షమాపణతో వారంతా శాంతించినట్టేనా?
మేమెప్పుడూ వ్యక్తులకు వ్యతిరేకంగా పోలేదు. ఉద్యమ సమయంలో కూడా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు. పొట్టకూటికోసం వచ్చిన వారితో కాదు.. పొట్టగొట్టేవారితోనే మా పోరాటం అని చెప్పినం. సీమాంధ్ర రాజకీయనాయకులు తమ స్వార్థం కోసం ప్రజలను తప్పుదోవపట్టించారు. ఇప్పుడు అంతా హైదరాబాదీలే. ఈ ఎన్నికల్లో చాలా చోట్ల సీమాంధ్రకు చెందిన వివిధ కులాల వారికి టికెట్లు ఇచ్చాం. వారంతా మా వెంటే ఉన్నారు.
చంద్రబాబు జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అంతగా సీరియస్‌గా తీసుకోకపోవడానికి ఓటుకు నోటు కేసే కారణమని వస్తున్న వార్తలపై మీరేమంటారు..?
ఈ కేసును ఏసీబీ పర్యవేక్షిస్తుంది. ఎప్పుడు ఏం, ఎలా చేయాలో వారే నిర్ణయిస్తారు. అంతకు మించి ఏమీ వ్యాఖ్యానించలేను.
దళిత విద్యార్థి రోహిత్ ఘటనకు బాధ్యత ఎవరిది. మీ సర్కార్ తరపున కనీస స్పందన కూడా లేదు..ఎందుకని?
ఈ విషయంలో మేం ఎంత వరకు వ్యవహరించాలో అలానే వ్యవహరిస్తున్నాం. అది కేంద్ర పరిధిలోని యూనివర్సిటీ కావటంతో మా ప్రమేయం తక్కువ ఉంటేనే మంచిదనుకున్నాం. రోహిత్ మరణం మాకు బాధాకరమే. ఘటన జరిగిన రోజే మా ఎంపీ కవిత స్పందించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ఇక రోహిత్ కులానికి సంబంధించిన వివాదం వస్తోంది. ఏది ఎలా ఉన్నా, నిజానిజాలు తెలియకుండా ప్రభుత్వాలు స్పందించటం సరికాదేమోనని మేము భావించాం.
19 నెలల కాలంలో నగరానికి మీరు ప్రత్యేకంగా చేసిందేమిటి..
గత ప్రభుత్వాలు ప్రారంభించినవి కాకుండా..
అరవై ఏళ్ల విముక్తి తర్వాత ‘మన నగరం - మన ప్రజలు - మన పాలన కోసం’ సీఎం ప్రత్యేక ప్రణాళికలు రచించారు. వాటికి అనుగుణంగా ఆయన 30 ఏళ్ల ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. మంచినీళ్లు, రహదారులు, ప్రజాభద్రత, డబుల్ బెడ్‌రూం ఇళ్ల పట్టాల పంపిణీ, సంక్షేమం, క్లీన్ హైదరాబాద్, అవినీతి లేని పాలనలు మా ప్రాధాన్యతలు. ఆ దిశగా వచ్చే రెండేళ్లలో నగరంతో పాటు శివారు ప్రాంతాలకు నిరంతరం కృష్ణా, గోదావరి మంచినీళ్లవ్వనున్నాం. రాచకొండ, శామీర్‌పేటల్లో 60 టీఎంసీల నీటి నిల్వ ఉండే రిజర్వాయర్లను నిర్మిస్తున్నాం.
నగరంలో నూతన మంచినీటి పైప్‌లైన్లు, డ్రైనేజీ, వరద నీటి కాల్వలకు కొత్త రూపు ఇవ్వబోతున్నాం. సుమారు 20 వేల కోట్లతో సిగ్నల్ ఫ్రీ రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పోలీస్ శాఖను అన్ని విధాలుగా పటిష్టం చేసి నేర నివారణ, నియంత్రణకు ప్రాధాన్యతనిస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మహిళల భద్రత కోసం ‘షీ’ టీం ఏర్పాటు చేశాం. అన్నింటికంటే ముఖ్యమైనది కనురెప్పపాటు కూడా కోతల్లేని విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఇవన్నీ మా సీఎం కేసీఆర్ హృదయం నుండి వచ్చినవే.