రాష్ట్రంలో శాంసంగ్ అకాడమీ
టైజెన్ ఓఎస్ ఆధారిత యాప్స్, సేవల రూపకల్పనపై శిక్షణ
టాస్క్, శాంసంగ్ సంయుక్తంగా నిర్వహిస్తాయన్న కేటీఆర్
సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా, జపాన్, తైవాన్‌లలో పర్యటించనున్నట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రఖ్యాత శాంసంగ్ సంస్థ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్(టాస్క్), శాంసంగ్ సంస్థ ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ అకాడమీ కొనసాగుతుందన్నారు. అందులో శాంసంగ్ ‘టైజెన్’ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత యాప్స్, ఎలక్ట్రానిక్ సేవల రూపకల్పనపై శిక్షణ ఇస్తారని వెల్లడించారు.
ఇప్పటికే శిక్షణ పొందిన విద్యార్థులు తయారు చేసిన యాప్స్‌లో మూడింటిని అత్యుత్తమమైనవిగా శాంసంగ్ ప్రతినిధులు ఎంపిక చేయగా... వాటిని రూపొందించిన వారికి సోమవారం టాస్క్ కార్యాలయంలో కేటీఆర్ బహుమతులను అందజేశారు. అనంతరం మాట్లాడారు. నిరుద్యోగ యువతకు, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగార్హత కల్పించేందుకు ‘టాస్క్’ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఇప్పటివరకు నాలుగు జిల్లాల్లో 40వేల మందికి ‘టాస్క్’ శిక్షణ ఇచ్చిందని.. త్వరలోనే మిగతా జిల్లాలకు విస్తరిస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగంలోని టాస్క్ వివిధ రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని శాంసంగ్ సంస్థ ప్రతినిధి దీపక్ పేర్కొన్నారు. టాస్క్, టీ-హబ్‌లతో శాంసంగ్ ఒప్పందాల ద్వారా మరింత నైపుణ్యం బయటకు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. టైజెన్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు రూపొందించిన హౌస్ హంట్, సేవ్ ఎన్విరాన్‌మెంట్, గర్లిష్, టూఫూడీ, హెల్తీవేస్, జాబ్స్‌హబ్, యమ్మీ ఫుడ్స్, ఆల్ ఖురాన్, భగవద్గీత, కెరీర్ మేట ర్ యాప్‌లకు మంచి స్పందన వచ్చిందన్నారు.
సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా పర్యటన
రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సెప్టెంబర్‌లో దక్షిణ కొరియా, జ పాన్, తైవాన్ దేశాల్లో పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేస్తున్న టీ-హబ్ రెండోదశను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలను టాస్క్, టీ-హబ్‌లలో భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈవో సుజీవ్ నాయర్, టీ-హబ్ సీఈవో శ్రీని కొల్లిపర, ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, డెరైక్టర్ కె.దిలీప్ తదితరులున్నారు.