సందడి చేసిన ‘పతంగి కారు’
బహదూర్‌పురా: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత, సుధాకార్స్ మ్యూజియం సృష్టికర్త సుధాకర్ పతంగుల కారును ఆవిష్కరించారు. వివిధ రూపాల్లో అతి చిన్న కార్లను రూపొందించి ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షించిన సుధాకర్... ఈసారి 150 సీసీ సామర్ధ్యం గల ఇంజిన్‌తో పతంగు (ౖకైట్) కారును రూపొందించారు. 10 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పుతో ఆటోరిక్షా ఆకారంలో రూపొందించారు.
శుక్రవారం ఆవిష్కరించిన ఈ కారు బహదూర్‌పురా రోడ్డుపై రయ్.. మంటూ దూసుకెళ్లింది. గంటకు 50–60 కిలో మీటర్ల వేగంతో ఈ పతంగి కారు రోడ్లపై పరుగులు తీస్తుందని కారు సృష్టికర్త సుధాకర్ తెలిపారు. సంక్రాంతి రోజు నగర వ్యాప్తంగా ఈ వాకీ కారును రోడ్లపై తిప్పనున్నామన్నారు. తాను రూపొందించిన వాకీ కార్లలో ఇది 50వ కారు అన్నారు. ప్రపంచంలో ఎవరూ 50 వరకు వాకీ కార్లను రూపొందించలేదని చెప్పారు. కైట్ ఆకారంలోని ఈ కారు తయారు చేయడానికి నెలరోజుల సమయం పట్టిందన్నారు.