ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ | SC, ST, 95 per cent subsidy to farmers | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ

Published Sun, Feb 14 2016 3:19 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ - Sakshi

ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ

సాక్షి, హైదరాబాద్: గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మాణానికయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఉద్యాన, వ్యవసాయ శాఖల జిల్లాస్థాయి అధికారులతో శనివారం వేర్వేరుగా జరిగిన సమీక్షా సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రీన్‌హౌస్ నిర్మాణ వ్యయంలో ప్రస్తుతం అందరికీ 75 శాతం సబ్సిడీ ఇస్తున్నామని, అయినా ఎస్సీ, ఎస్టీ రైతులకు భారంగా ఉందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ వారికి 95 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారన్నారు. దీనివల్ల ఒక ఎకరంలో గ్రీన్‌హౌస్ నిర్మాణానికి రూ. 33.75 లక్షలు ఖర్చు అయితే... అందులో ఎస్సీ, ఎస్టీ రైతులు రూ. 1.68 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన సొమ్ము ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.

అర ఎకరానికి ఎస్సీ, ఎస్టీ రైతులు రూ. 95 వేలు, పావు ఎకరానికి రూ. 47 వేలు, 500 చదరపు మీటర్లకు రూ. 29 వేలు, 200 చదరపు మీటర్లకు రూ. 10,600 చెల్లించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తాము తీసుకున్న నిర్ణయాల వల్ల ఏడాది కాలంలోనే కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.  ఉల్లి సాగు విస్తీర్ణాన్ని కూడా 12,500 ఎకరాల్లో అదనంగా పెంచామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లతో సంబంధం లేకుండా ఉద్యాన కార్పొరేషన్‌కు నాబార్డు ద్వారా రూ. 2,500 కోట్లు రుణం ఇప్పిస్తామని, దీన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఉద్యాన శాఖలో 1,170 పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించామని, కనీసం 500 పోస్టులైనా తప్పనిసరిగా భర్తీ జరుగుతుందని ఆయన స్పష్టంచేశారు. మెదక్ జిల్లాలో 200 ఎకరాల్లో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై అధ్యయనం చేసేందుకు బడ్జెట్ సమావేశాల్లోపే డెన్మార్క్, పోలండ్ తదితర దేశాల్లో పర్యటిస్తామని తెలిపారు. వినియోగదారులకు కల్తీలేని ఆహార పదార్థాలు అందిస్తామని, కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రాష్ట్రంలో 1.10 లక్షల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి, ఆ శాఖ కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 అధికారులపై మంత్రి ఆగ్రహం

 రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతోంటే మీరంతా ఏం చేస్తున్నారని, ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ను ఖర్చుపెట్టడంలోనూ విఫలమయ్యారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులపై మండిపడ్డారు. వ్యవసాయ యంత్రాలకు ఖర్చుపెట్టాల్సిన డబ్బులు నిలిచిపోయాయని, ఎందుకీ పరిస్థితి వచ్చిందని నిలదీశారు. ‘అధికారులు చేయాల్సిన సమీక్షను నేను చేయాల్సి రావడం దురదృష్టకరం. ఇలాగైతే మీరంతా ఏం చేస్తున్నట్లు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎందుకు పర్యటించడంలేదని ప్రశ్నించారు. కరువు తీవ్రంగా ఉన్న సమయంలో రైతులకు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా అని అన్నట్లు తెలిసింది. అవగాహనలేని వ్యక్తులు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఉన్నారని అన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement