‘గుర్తింపు’ ఉంటేనే సచివాలయం ఎంట్రీ
జూన్ 2 నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చే సందర్శకులను ఇకపై ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటేనే లోపలకి అనుమతించనున్నారు. ఈ కొత్త విధానం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. సచివాలయ ప్రధాన ద్వారం వద్ద సందర్శకుల ‘గుర్తింపు’ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి అప్పటికప్పుడు పాస్‌లను జారీ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సచివాలయంలో ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు.
జూన్ 2 నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులైన డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపు కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులలో ఏదైనా ఓ కార్డును తీసుకువస్తేనే అనుమతిస్తామని సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి ఎన్.శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు పాస్‌లు జారీ చేస్తామన్నారు.