నా జీవనగమనాన్నే మార్చేసింది... | Secunderabad Cantonment Board CEO sujatha gupta Memories in OU | Sakshi
Sakshi News home page

నా జీవనగమనాన్నే మార్చేసింది...

Published Wed, Apr 26 2017 9:48 AM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM

నా జీవనగమనాన్నే మార్చేసింది...

నా జీవనగమనాన్నే మార్చేసింది...

వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఓయూలో ఎందరెందరో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించారు. అది..ఇది అని కాకుండా దాదాపు ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ఓయూ విద్యార్థులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఓయూలో చదువుకుని రక్షణ శాఖలో పనిచేస్తున్న అధికారిణి సుజాత, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ బాలకృష్ణ ఓయూలో తమ అనుభవాలను సాక్షితో పంచుకున్నారు....

కంటోన్మెంట్‌: ఉస్మానియా వర్సిటీలో చదువుకునే సమయంలోనే నా జీవితం అనూహ్య మలుపు తిరిగింది. నేను ఆర్‌ట్టŠస్‌ కళాశాలలో ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ (1991–93) చదువుకోవడంతోపాటు ఇక్కడే పీహెచ్‌డీ స్కాలర్‌గా జాయిన్‌ అయ్యాను. అదే సమయంలోనే 1996లో సివిల్‌ సర్వీసెస్‌ (ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ ఆఫీసర్‌ – ఐడీఈఎస్‌)కు ఎంపికయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలోని అద్భుత వాతావరణమే నన్ను సివిల్‌ సర్వీసెస్‌ వైపునకు మళ్లించింది. ఐదేళ్ల పాటు యూనివర్సిటీ లైబ్రరీలోనే చదువుకొని..తొలి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌ సాధించాను. నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి, ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం కల్పించిన ఉస్మానియా యూనివర్సిటీని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడి ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్స్, లైబ్రరీ, ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణం భవిష్యత్‌లో మరెంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నాను. యూనివర్సిటీ వందేళ్ల సంబరాల్లో పాల్గొనడం అమితానందాన్ని కలిగిస్తోంది.
– సుజాత గుప్తా, డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ పశ్చిమ కమాండ్‌ డైరెక్టర్, కంటోన్మెంట్‌ మాజీ సీఈఓ

మధురానుభూతుల కోవెల ఇది...
ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం నాకు మరిచిపోలేని మధురానుభూతుల కోవెల వంటింది. 1991లో ఎన్‌ఐటీ వరంగల్‌లో బీటెక్‌ పూర్తయ్యాక, ఉస్మానియాలో ఎంటెక్, ఆ తర్వాత ఉస్మానియా లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాను. దాదాపు నాలుగున్నరేళ్లు ఓయూ డీ హాస్టల్‌లో ఉన్నాను. ఆ సమయంలోనే నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌గా ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత 1996లో సివిల్‌ సర్వీసెస్‌ (ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్స్‌ సర్వీసెస్‌)కు ఎంపికయ్యాను. ఇప్పటికీ ఉస్మానియా ప్రాంగణంలోకి వెళితే మాటలతో వర్ణించలేని భావోద్వేగానికి లోనవుతుంటాను. అక్కడి చెట్లు, ల్యాండ్‌ స్కేప్‌లు, బండరాళ్లు, హాస్టల్, లైబ్రరీ ప్రతి ఒక్కటీ నా జీవితంలో భాగమయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా యూనివర్సిటీకి వెళ్లి అక్కడి పరిసరాల్లో గడపడం నాకు హాబీగా మారింది. ప్రస్తుతం వందేళ్ల సంబరాల్లో పూర్వ విద్యార్థిగా పాల్గొనబోతుండడం నాకు అమితానందం కలిగిస్తోంది.
– సూర బాలకృష్ణ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్, ఎండీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement