sujatha gupta
-
స్పెషల్ కమిషనర్ సుజాత గుప్తా
కంటోన్మెంట్: సికింద్రాబాద్–కంటోన్మెంట్ బోర్డు మాజీ సీఈఓ, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్ (ఐడీఈఎస్) రిటైర్డ్ అధికారి సుజాత గుప్తాకు అరుదైన అవకాశం దక్కింది. ఆమెను జీహెచ్ఎంసీ స్పెషల్/అడిషనల్ కమిషనర్ (పారిశుధ్య విభాగం ఇన్చార్జ్)గా నియమించారు. ఏడాది కాంట్రాక్టుతో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమితులైన సుజాతకు రూ.2లక్షల వేతనం చెల్లించడంతో పాటు వాహనం, ఫోన్ సదుపాయాలు కల్పించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారమే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక గుర్తింపు... 1997లో ఐడీఈఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన సుజాత 2013–17 వరకు కంటోన్మెంట్ సీఈఓగా పనిచేశారు. కంటోన్మెంట్ చరిత్రలోనే ఎక్కువ కాలం సీఈఓగా పని చేసిన ఆమె... పదవీ కాలంలో పలు సాహసోసేపేత నిర్ణయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రక్షణ శాఖ భూములను ఆక్రమించుకున్న వారిపై కొరడా ఝులిపించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సుమారు 20కి పైగా ఓల్డ్ గ్రాంట్ బంగళాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. కంటోన్మెంట్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఫలించాయి. ఇక పారిశుధ్య విభాగానికి సంబంధించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ప్రాజెక్టు కంటోన్మెంట్‌కు దక్కేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ప్రాజెక్టుకు తగిన స్థలాన్ని కేటాయించడంలో బోర్డు వైఫల్యంతో అది ప్రారంభ దశలోనే ఆగిపోయింది. 2017లో ఆమె బదిలీ అనంతరం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఇదే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సోలార్ ప్రాజెక్టును మాత్రం విజయవంతంగా అమలు చేయగలిగారు. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ అమలులోనూ తనదైన ముద్ర వేయడంతో కేంద్ర రక్షణ శాఖ అవార్డు కూడా అందుకున్నారు. 2017లో వెస్ట్రన్ కమాండ్ డైరెక్టర్ పదోన్నతిపై వెళ్లిన సుజాత గుప్తా.. అనంతరం స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆమె భర్త ప్రభాత్‌కుమార్ గుప్తా హైదరాబాద్‌లో ఇన్‌కంటాక్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సమర్థవంతంగా పనిచేస్తా... నాపై నమ్మకంతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాను. శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. ప్రపంచవ్యాప్తంగా పారిశుధ్యం ప్రధాన సమస్యగా మారింది. చెత్త సేకరణ దశ నుంచి డిస్పోజల్ వరకు ఓ ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తే చెత్త పెద్ద సమస్యేమీ కాదు. ఈ మేరకు ప్రజల్లోనూ సరైన అవగాహన కల్పించాలి. నగరంలో రోజువారీ చెత్త సేకరణ ఓ మహాయజ్ఞంలా సాగుతోంది. కొన్ని ప్రత్యేక చర్యల ద్వారా మరింత సమర్థవంతంగా పారిశుధ్య నిర్వహణ ఉండేలా కృషి చేస్తాను. – సుజాత గుప్తా -
నా జీవనగమనాన్నే మార్చేసింది...
వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఓయూలో ఎందరెందరో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించారు. అది..ఇది అని కాకుండా దాదాపు ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ఓయూ విద్యార్థులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఓయూలో చదువుకుని రక్షణ శాఖలో పనిచేస్తున్న అధికారిణి సుజాత, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ బాలకృష్ణ ఓయూలో తమ అనుభవాలను సాక్షితో పంచుకున్నారు.... కంటోన్మెంట్: ఉస్మానియా వర్సిటీలో చదువుకునే సమయంలోనే నా జీవితం అనూహ్య మలుపు తిరిగింది. నేను ఆర్ట్టŠస్ కళాశాలలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (1991–93) చదువుకోవడంతోపాటు ఇక్కడే పీహెచ్డీ స్కాలర్‌గా జాయిన్ అయ్యాను. అదే సమయంలోనే 1996లో సివిల్ సర్వీసెస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ – ఐడీఈఎస్)కు ఎంపికయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలోని అద్భుత వాతావరణమే నన్ను సివిల్ సర్వీసెస్ వైపునకు మళ్లించింది. ఐదేళ్ల పాటు యూనివర్సిటీ లైబ్రరీలోనే చదువుకొని..తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ సాధించాను. నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి, ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం కల్పించిన ఉస్మానియా యూనివర్సిటీని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అక్కడి ల్యాండ్‌స్కేప్ గార్డెన్స్, లైబ్రరీ, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం భవిష్యత్‌లో మరెంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నాను. యూనివర్సిటీ వందేళ్ల సంబరాల్లో పాల్గొనడం అమితానందాన్ని కలిగిస్తోంది. – సుజాత గుప్తా, డిఫెన్స్ ఎస్టేట్స్ పశ్చిమ కమాండ్ డైరెక్టర్, కంటోన్మెంట్ మాజీ సీఈఓ మధురానుభూతుల కోవెల ఇది... ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం నాకు మరిచిపోలేని మధురానుభూతుల కోవెల వంటింది. 1991లో ఎన్ఐటీ వరంగల్‌లో బీటెక్ పూర్తయ్యాక, ఉస్మానియాలో ఎంటెక్, ఆ తర్వాత ఉస్మానియా లా కాలేజీలో ఎల్ఎల్బీ పూర్తి చేశాను. దాదాపు నాలుగున్నరేళ్లు ఓయూ డీ హాస్టల్లో ఉన్నాను. ఆ సమయంలోనే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌గా ఉద్యోగం సాధించాను. ఆ తర్వాత 1996లో సివిల్ సర్వీసెస్ (ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసెస్)కు ఎంపికయ్యాను. ఇప్పటికీ ఉస్మానియా ప్రాంగణంలోకి వెళితే మాటలతో వర్ణించలేని భావోద్వేగానికి లోనవుతుంటాను. అక్కడి చెట్లు, ల్యాండ్ స్కేప్‌లు, బండరాళ్లు, హాస్టల్, లైబ్రరీ ప్రతి ఒక్కటీ నా జీవితంలో భాగమయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా యూనివర్సిటీకి వెళ్లి అక్కడి పరిసరాల్లో గడపడం నాకు హాబీగా మారింది. ప్రస్తుతం వందేళ్ల సంబరాల్లో పూర్వ విద్యార్థిగా పాల్గొనబోతుండడం నాకు అమితానందం కలిగిస్తోంది. – సూర బాలకృష్ణ, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ