సరోజినీదేవి ఆస్పత్రిపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్
సీఎస్, డీజీపీలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఇటీవల కేటరాక్ట్ సర్జరీ చేయించుకున్న ఏడుగురు బాధితులకు కంటిచూపు పోయిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకుని కేసు న మోదు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉంటే 15 రోజుల విరామం తర్వాత శుక్రవారం ముగ్గురు బాధితులకు కేటరాక్ట్ సర్జరీలు చేశారు.
మరో నలుగురిని ఇన్‌పేషంట్లుగా అడ్మిట్ చేసుకున్నారు. ఈ దుర్ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్, లోకాయుక్త విచారణకు ఆదేశించగా, ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. దీనిపై ఔషధ నియంత్రణ మండలి, ఉన్నత స్థాయి నిపుణుల బృందం విచారిస్తుంది. అయితే ఇన్‌ఫెక్షన్‌కు సెలైన్ బాటిల్లో ఉన్న బ్యాక్టీరియానే కారణమని ఇప్పటికే ఆస్పత్రి వైద్యుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, ఈ ఘటనలో వైద్యపరమైన నిర్లక్ష్యం ఉందని రోగులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లలో ఫ్యూమిగేషన్‌ను చేపట్టి ఎలాంటి బ్యాక్టీరియా లేదని నిర్ధారించుకున్న తర్వాతే థియేటర్లను తెరిచినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.