గుప్పెడంత గుండెలో.. ‘విశ్వ’మంత ఆశ | Show the location being on the side of the central budget | Sakshi
Sakshi News home page

గుప్పెడంత గుండెలో.. ‘విశ్వ’మంత ఆశ

Published Sat, Feb 28 2015 12:16 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

Show the location being on the side of the central budget

కేంద్ర బడ్జెట్ వైపు నగర జీవి చూపు
కొత్త పథకాల కోసం ఎదురు తెన్నులు
మౌలిక వసతులకు నిధులు కావాలని కోరిక
మంచినీటికి తహతహ
సొంత ఇళ్ల కోసం నిరీక్షణ

 
‘విశ్వ’మంత నగరం... సర్వత్రా ఇదే మంత్రం...  ఎన్నో ఆశలతో ప్రగతి వైపు పయనం... ఆధునికత వైపు  అడుగులేయాలనే ఉత్సాహం... బస్తీల్లో మౌలిక వసతుల కొరత.... పేదలకు సొంత గూడు లేని దయనీయత... వెనక్కు లాగుతున్న వైనం. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర బడ్జెట్ తారక మంత్రమవుతుందనే విశ్వాసం.  తమ కలలు నెరవేరుస్తుందనే నమ్మకం... అందుకే క్షణమొక యుగంగా నిరీక్షణం. మరికొన్ని గంటల్లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ కోసం నగర జీవి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు...  తమకు కొత్త దారి చూపుతుందని భావిస్తున్నాడు.

సిటీబ్యూరో:  కేంద్ర బడ్జెట్‌పై గ్రేటర్ వాసులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం ప్రవేశ పెట్టనున్న 2015-16 వా  ర్షిక బడ్జెట్.. కేంద్ర ప్రాయోజిత పథకాలు, బడ్జెటరీ నిధుల ద్వారా మహా నగరాన్ని స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సర్కారు నిధుల వర్షం కురిపిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన, ఉచిత వై-ఫై సేవలు, శివారు ప్రాంతాల్లో మంచినీరు, మురుగునీటి పారుదల వ్యవస్థల ఏర్పాటు, చారిత్రక మూసీ నది ప్రక్షాళన వంటి కీలక పథకాలకు సాయం అందిస్తుందని వివిధ ప్రభుత్వ విభాగాలు ఎదురు చూస్తున్నాయి. కేంద్ర సాయానికి చూస్తున్న కొన్ని పథకాలను పరిశీలిస్తే...

‘అమృతం’ కురుస్తుందా?

జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం స్థానే కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘అమృత్’ను ప్రవేశపెట్టనుంది. దీనిలో భాగంగా గ్రేటర్‌లో విలీనమైన శివారు మున్సిపాల్టీల్లో మంచినీటి సౌకర్యానికి రూ.1632 కోట్లు, మురుగు నీటి పారుదల వ్యవస్థకు రూ.2400 కోట్ల అంచనాతో రూపొందించిన పథకాలకు కేంద్రం చేయూతనందిస్తుందని జలమండలి భావిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్ ఇదే విషయమై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి ఈ పథకాలకు ప్రతిపాదనలు సమర్పించారు. వీటికి ఆర్థిక సాయం అందించే విషయమై మంత్రిసానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో వీటికి నిధుల వరద పారుతుందని శివారు వాసులు ఆశతో ఉన్నారు.
 
మైనార్టీ సంక్షేమ శాఖ ఆశలు  రూ.200 కోట్లపైనే...

కేంద్ర బడ్జెట్‌పై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ భారీగానే ఆశలు పెట్టుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి వివిధ పథకాల కింద సుమారు రూ.200 కోట్లు కేటాయించవచ్చని భావిస్తోంది. ఇటీవల ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ కేంద్ర మైనార్టీ వ్యవహార మంత్రిత్వ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా తదితరులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆర్థిక చేయూత అందించాలనివిజ్ఞప్తి చేశారు. కేంద్రం పథకాలను రాష్ట్రానికి వర్తింపజేయాలని కోరారు. ఉపకార వేతనాల మంజూరుపై చర్చించారు. ఇటీవల కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అరవింద్ రాష్ట్ర పర్యటన సందర్భంగా వివిధ ప్రతిపాదనలు సమర్పించారు. దీనిపై సానుకూల స్పందన లభించింది. ఫలితంగా ఈ సారి భారీగానే నిధుల కేటాయింపు ఉంటుందని మైనార్టీ సంక్షేమ శాఖ భావిస్తోంది.
 
మూసీకి మోక్షం కల్పించాలని...


సుమారు రూ.932 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసిన చారిత్రక మూసీ ప్రక్షాళన రెండో దశకు బడ్జెట్‌లో సుమారు రూ.70 శాతం నిధులు కేటాయిస్తుందని జలమండలి విశ్వసిస్తోంది. నిత్యం సుమారు 600 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల చేరికతో కాలుష్య కాసారమవున్న ఈ నదిలో పదిచోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు, రీసైక్లింగ్ యూనిట్లు నెలకొల్పితేనే దశల వారీగా మురుగు నుంచి   పరిరక్షించవచ్చని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.

కొత్త బస్సుల కోసం

ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకం కింద రావాల్సిన 520 బస్సుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ఎదురుచూస్తోంది. వీటితో శివారు ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేయాలని భావిస్తోంది. ఈ బస్సులను కొత్తగా 200 రూట్లలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
 
ఐటీఐఆర్‌కు వెన్నుదన్నుగా...

రాష్ట్ర రాజధాని రూపురేఖలను సమూలంగా మార్చనున్న ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) పరిధిలోకి సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ఉప్పల్-పోచారం, సైబరాబాద్-ఎయిర్‌పోర్ట్ (గ్రోత్ కారిడార్-1), ఎయిర్‌పోర్ట్-ఉప్పల్(గ్రోత్ కారిడార్-2) ప్రాంతాలు రానున్నాయి. 202 చదరపు కి.మీ. పరిధిలో విస్తరించనున్న ఐటీఐఆర్ మొదటి దశ ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేయాలని 2013లోనే లక్ష్యం నిర్దేశించారు. ప్రతిష్టాత్మక ప్రైస్ వాటర్ కూపర్స్ అంతర్జాతీయ సంస్థ సుమారు రూ.2.18 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించనున్న ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విషయం విదితమే. అయితే ఈ స్థాయిలో పెట్టుబడులు రావాలంటే ఐటీఐఆర్ పరిధిలో అదే స్థాయిలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. ఇందుకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా సాయం అందుతుందని రాష్ట్ర సర్కారు ఎదురు చూస్తోంది.

స్మార్ట్‌సిటీకి సాయం అందేనా...

గ్రేటర్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చి... అన్ని ప్రధాన మార్గాల్లో వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ఆర్థిక తోడ్పాటునందిస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ ఆశిస్తోంది.ఏడాదిలోగా హయత్‌నగర్-మియాపూర్, నాగోల్-హైటెక్ సిటీ, జేబీఎస్-శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం తదితర ప్రధాన మార్గాల్లో సుమారు 660 కి.మీ. మేర పూర్తి స్థాయిలో వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర సాయం తప్పనిసరని భావిస్తోంది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకుండా గ్రేటర్‌లో వై-ఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐటీ శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement