దారి చూపండి..
సాక్షి, సిటీబ్యూరో: ‘నగరంలో మౌలిక సౌకర్యాల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లు కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా ధ్వంసమయ్యాయి. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. దీంతో వర్షం వచ్చినప్పుడల్లా అవి పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. పారిశుధ్యం అధ్వానంగా మారుతోంది. దోమలు దండెత్తుతున్నాయి. డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయి...తక్షణమే స్పందించండి. ఈ సమస్యలకు పరిష్కారం చూపండి. నాలాలలపై కబ్జాలను సీరియస్‌గా తీసుకోవాలి..’ అని నగర కార్పొరేటర్లు ముక్తకంఠంతో గళమెత్తారు. సోమవారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జీహెచ్‌ఎంసీ సర్వసభ్య సమావేశంలో నాలాలతోపాటు అధ్వాన్నపు రహదారులు, డెంగీ కే సులు, పారిశుధ్య కార్యక్రమాలపై సభ్యులు తమ వాణి వినిపించారు.
సదరు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. నగరంలోని నాలాలన్నీ ఆక్రమణలకు గురైనందునే వరదనీరు వెళ్లే మార్గం లేక నాలాలు పొంగిపొర్లుతూ మృత్యుమార్గాలుగా మారాయన్నారు. నిబంంధనలను ఉల్లంఘించి నాలాల వెంబడి భవన నిర్మాణాలకు అనుమతులిస్తుండటంవల్ల సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు.నగరం మరో చెన్నయ్‌లా మారకుండా ఉండాలంటే అనుమతులిచ్చేముందు సంబంధిత విభాగాలన్నింటి మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. పరిస్థితులిలా ఉంటే బంగారు తెలంగాణ ఎలా అవుతుందని ప్రశ్నించారు. వరదనీరు, డ్రైనేజీ కలగలసి పారుతుండటాన్ని నిరోధించాలని కోరారు. శివార్లలో సివరేజి బాధ్యతలు పూర్తిగా జలమండలికి అప్పగించాలని కోరారు. బల్కాపూర్ నాలావల్ల తీవ్ర సమస్యలు ఎదురువుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి కార్పొరేటర్లందరితో సమావేశం నిర్వహించాలని కోరారు.
పాతబస్తీలోని నాలాల సమస్యలపై ఒక కమిటీ వేయాలని ఎంఐఎం సభ్యులు కోరారు. నాలాలు, రోడ్ల సమస్యలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించాలని ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సూచించారు. మురికినాలా ఒక్కటే మొత్తం భారం మోయలేనందున అదనపు వరదకాలువల అవసరం ఉందని ఎమ్మెల్యే బలాలా సూచించారు. సరూర్‌నగర్ చెరువు నీటిని మూసీకి తరలించే చర్యలు చేపట్టాలని స్థానిక కార్పొరేటర్లు కోరారు. చేపలచెరువు కబ్జాదారులను ఖాళీ చేయించాలన్నారు. గ్రేటర్‌లోని పనులన్నీ కొందరు కాంట్రాక్టర్లే చేపడుతున్నందున పనుల్లో నాణ్యత ఉండటం లేదని, వారే నగరాన్ని నాశనం చేస్తున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించే పనులకు పరిమితి ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.