ఎస్సై ఫలితాలు మరింత జాప్యం!
మొత్తం 9 నెలల కానిస్టేబుళ్ల శిక్షణను ప్రస్తుతం రెండు సెమిస్టర్లుగా విభజించారు. అందులో భాగంగా మొదటి మూడున్నర నెలలు శిక్షణ ముగిస్తేనే ఎస్సై ఫలితాలపై కొంత ముందుకెళ్లే అవకాశం ఉందని శిక్షణ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. ఒకేసారి రెండు విభాగాలకు శిక్షణ ఇవ్వడం కుదరదని శిక్షణ విభాగం తేల్చిచెప్పడంతో రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలపై వెనక్కి తగ్గిందన్న వాదన వినిపిస్తోంది. కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభమై దాదాపు నెలన్నరకాగా మరో నెలన్నర దాటితేగానీ ఎస్సై ఫలితాలు రావన్నది పోలీసుశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు కానిస్టేబుల్ ఫలితాల్లో రిజర్వేషన్ అమలు తీరు, కటాఫ్ వంటి అంశాలపై 143 మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడం, కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థుల ఎంపికకు ఒకే రకమైన విధానాలుండటంతో ఈసారి రోస్టర్, కటాఫ్, రిజర్వేషన్ తదితరాలను పకడ్బందీగా అమలు చేసి ఫలితాలు ప్రకటించాలని బోర్డు భావిస్తున్నట్లు తెలిసింది.