కర్ణాటకకు సింగరేణి బొగ్గు
ఈ ఏడాది 80 లక్షల టన్నుల సరఫరా
- కేపీసీఎల్‌తో సింగరేణి సంస్థ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నుంచి 80 లక్షల టన్నుల బొగ్గును కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నగరంలోని ఓ హోటల్‌లో సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్, కేపీసీఎల్ ఎండీ కుమార్ నాయక్‌ల సమక్షంలో రెండు సంస్థల ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంత కాలు చేశారు. దీని ప్రకారం సింగరేణి కర్ణాటకలోని రాయచూర్‌లోని కేపీసీఎల్‌కు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయ నుంది. కేపీసీఎల్ ఇటీవల ఎర్రమారస్‌లో నిర్మించిన మరో థర్మల్ విద్యుత్ కేంద్రానికి 20 లక్షల టన్నులు, బళ్లారిలోని బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 31 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనుంది.
ఇదిలా ఉండగా, సింగరేణి సంస్థ నాణ్యమైన బొగ్గును సకాలంలో అందజేయడంతో తమకు విద్యుదుత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్) మెరుగుపడిం దని కేపీసీఎల్ ఎండీ.కుమార్‌నాయక్ అన్నారు. 32 శాతం కన్నా తక్కువ తేమ గల బొగ్గును సింగరేణి అందించేందుకు చొరవ తీసుకుం టోందన్నారు. రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పదేళ్లలో ఎన్నడూ సాధించని విధంగా గతేడాది 77 శాతం పీఎల్‌ఎఫ్ సాధించిందని, ఈ ఘనత సింగరేణికే దక్కుతుందన్నారు. ఈ కారణంగానే సింగరేణిపై విశ్వాసం ఉంచుతూ ఈ ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
లక్ష్యానికి మించి బొగ్గు డిమాండ్..
సింగరేణి సంస్థ ఈ ఏడాది 660 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్న ప్పటికీ డిమాండ్ 800 లక్షల టన్నుల వరకు ఉందని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. అయినా ఈ ఏడాది కర్ణాటకకు బొగ్గు సరఫరా చేస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థలతో పాటు కోలిండియా పరిధిలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సైతం బొగ్గును సరఫరా చేస్తున్నా మన్నారు. నాణ్యమైన బొగ్గును సకాలంలో అందిస్తుండడంతో సింగరేణి బొగ్గుకు డిమాండ్ మరింత పెరిగిందన్నారు.