‘మత్తు’కు కొత్తదారి!
నేపాల్ మీదుగా తరలిస్తున్న స్మగ్లర్లు
విమాన, సముద్ర మార్గాల్లో ముంబైకి
పెరూ, లిబియాల్లోనే ఉత్పత్తి
తమ దేశాలకు ‘పంపేది’ వస్త్రాలుగా
డ్రగ్స్ ముఠా విచారణలో వెలుగులోకి
సిటీబ్యూరో: విదేశాల నుంచి దేశంలోని మత్తు పదార్థాలను తీసుకురావడానికి స్మగ్లర్లు కొత్తకొత్త ‘మార్గాలను’ అనుసరిస్తున్నారు. ముంబైకి విమాన, సముద్ర మార్గాల్లో, రోడ్డు మార్గంలో నేపాల్ నుంచీ వీటిని తరలిస్తున్నారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన ముఠా విచారణలో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో నివసిస్తున్న నైజీరియా, సౌతాఫ్రికన్లు ఇక్కడ డ్రగ్స్ విక్రయించగా వచ్చిన సొమ్మును వస్త్రాలుగా మార్చి తమ దేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడైంది.
కీలక సూత్రధారి జేమ్స్ మండేలా...
సిటీలో కొకైన్ క్రయవిక్రయాలకు పాల్పడుతున్న జేమ్స్ మండేలా (సౌతాఫ్రికా), డ్రాకే ఒవెన్ (ఘనా)లతో పాటు నగరంలో నివసిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ అభిషేక్ కుమార్, జి.శ్రీనివాసులు (ఆఫీస్ బాయ్), ఎం.శ్రీనివాస్ (ప్రైవేట్ ఉద్యోగి), జేఈ నవీన్‌కుమార్ (కారు డ్రైవర్)లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి నుంచి 370 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సౌతాఫ్రికావాసి జేమ్స్ మండేలా కీలక సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బిజినెస్ వీసాపై వచ్చిన ఇతను ముంబైలో నివసిస్తూ తన బంధువైన ఒవెన్‌ను సైతం పిలిపించుకుని వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నాడు.
దుస్తుల్లోకి మారకం
డ్రగ్స్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న నైజీరియా, సౌతాఫ్రికన్లు తమ కుటుంబాలను వారి దేశాల్లోనే ఉంచుతున్నారు. విజిట్, బిజినెస్, స్టడీ వీసాలపై వస్తూ దేశంలో స్థిరపడుతున్నారు. ‘సరుకు’ విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును నగదు రూపంలో ఆయా దేశాలకు పంపాలంటే అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో విక్రేతలంతా’ వస్త్రవ్యాపారులుగా మారిపోతున్నారు. దందాలో సంపాదించిన డబ్బుతో ప్రతి నెలా ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలో వస్త్రాలు ఖరీదు చేస్తున్నారు. బిజినెస్ వీసాపై ఉన్న వారి సహకారంతో వీటిని తమ దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఆయా దేశాల్లోని వీరి కుటుంబీకులు వస్త్రదుకాణాలు నిర్వహిస్తూ ఇలా వచ్చిన వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
సంపన్న కుటుంబమే అయినా...
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సోమవారం పట్టుబడిన ఆరుగురిలో ఒకడైన అభిషేక్ కుమార్ స్వస్థలం ముం బై. మోడలింగ్‌తో పాటు బాలీవుడ్ సినిమాల్లో చిన్నచిన్న క్యారెక్టర్లు చేశాడు. ఇతడిది సంపన్న కుటుంబమే అయినా, గతంలో కొన్ని సినిమాల్లో నటించిన అభిషేక్‌కు జల్సాలకు అలవాటు పడ్డాడు. తరచుగా సింగపూర్, మలేషియాలకు టూర్లు వెళ్ళిరావడం, పార్టీలు నిర్వహించడం చేసేవాడు. ఇలానే ఇతడికి జేమ్స్ మండేలాతో పరిచయమై మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఆపై సినిమా, మోడలింగ్ ఆఫర్లు తగ్గిపోవడంతో డబ్బు సంపాదించడం కోసం మండేలాతో కలిసే డ్రగ్స్ విక్రేతగా మారాడు. తదుపరి విచారణ నిమిత్తం ఆరుగురు నిందితుల్నీ కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు.
కేజీ రూ.లక్షకు ఖరీదు చేస్తూ...
కొకైన్ ప్రధానంగా పెరూ, లిబియా దేశాల్లో ఉత్పత్తి అవుతోంది. అక్కడి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న జేమ్స్ మండేలా కేజీ రూ.లక్ష (గ్రాము రూ.వెయ్యి) చొప్పున ఖరీదు చేస్తున్నాడు. అందుకు సరిపడ నగదు అక్కడి చేరిన వెంటనే వారు పార్శిల్ చేసి కొరియర్ ద్వారా విమాన మార్గంలో ముంబైకి పంపిస్తున్నారు. వీటిని స్కానింగ్ చేసినా లోపలి వస్తువులు కనిపించకుండా ఉండేలా కార్బన్ పేపర్ చుట్టడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో ఇబ్బందులు ఎదురయ్యే పక్షంలో తమ అనుచరురుల ద్వారా సముద్ర మార్గంలో ఓడల ద్వారా ముంబై కి చేరుస్తున్నారు. వీటిని అందుకునే మండేలా ముంబైలోనే ఉంటూ... ఒవెన్ ద్వారా దేశవ్యాప్తంగా సరఫరా చేసేవాడు. నిఘా, తనిఖీలు తక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతోనే వీరు అక్రమ రవాణాకు బస్సుల్ని ఆశ్రయిస్తున్నారు. వినియోగదారుడి వద్దకు చేరేసరికి గ్రాము కొకైన్ రూ.5 వేలు పలుకుతోంది.
కొత్తగా నేపాల్ రూట్...
విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉన్నప్పుడు, ‘సరుకు’ అత్యవసరంగా డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ముఠాలు నేపాల్ మార్గాన్ని అనుసరిస్తున్నట్లు కొత్తగా వెలుగులోకి వచ్చింది. పెరూ, లిబియాల్లో ఉండే సప్లయర్లు తమ అనుచరులకు నేపాల్ విజిట్ వీసా తీసుకుంటున్నారు. ‘సరుకు’తో సహా విమానంలో కనీసం ఇద్దరిని పంపుతూ ఒకరిని నేపాల్‌లోనే ఉంచేస్తున్నారు. ‘మాల్’ తీసుకుని భారత్‌లోకి ప్రవేశించే వ్యక్తి తన పాస్‌పోర్ట్‌ను నేపాల్‌లో ఉన్న వ్యక్తి వద్దే ఉంచేసి అక్రమంగా ఇక్కడకు అడుగుపెడతాడు. ఒకవేళ అతడు చిక్కినా... పాస్‌పోర్ట్ పోలీసులకు దొరక్కపోతే బెయిల్‌పై వచ్చి తమ దేశం పారిపోవడానికి అనువుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘సరుకు’ డెలివరీ అయిన తర్వాత నేపాల్ మీదుగానే తమ దేశాలకు వెళ్ళిపోతున్నట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.