స్నాచర్‌గా మారిన హోంగార్డు.. !
ఇంటి దొంగను విచారిస్తున్న పోలీసులు?
14 కేసుల్లో నిందితుడిగా అనుమానం
కుత్బుల్లాపూర్: స్నాచర్ అవతారమెత్తాడో హోంగార్డు. దొంగిలించిన వాహనాలపై జల్సాలు చేయడంతో పాటు తిన్నింటికే కన్నం వేసే పనికి పూనుకున్నాడు. ఇతడి వ్యవహార శైలిపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుంటే విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో నేరాలు ఒప్పుకోవడంతో పోలీసులు సొత్తు రికవరీపై దృష్టిపెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు.... బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు(ఆఫీస్‌బాయ్) గా పని చేస్తున్న ఓ వ్యక్తి అతి ఖరీదైన ద్విచక్ర వాహనాలకు డ్యూటీకి వస్తున్నాడు. దీంతో అతడిపై పోలీసుల దృష్టి పడింది. మూడు నెలలుగా ఇతను అడపాదడపా రూ. లక్షకు పైగా విలువ చేసే వాహనాలను తీసుకువస్తుండడంతో అధికారులకు అనుమానం మరింత బలపడింది.
విధులకు హాజరయ్యే సమయంలో స్నాచింగ్‌లకు పాల్పడి, నేరుగా స్టేషన్‌కు రావడం, విధులు ముగించుకొని వెళ్లే సమయంలో స్నాచింగ్‌లకు పాల్పడటం చేస్తున్నాడు. అంతే కాకుండా డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల విడి భాగాలను, ధ్రువ పత్రాలు లేని వాహనాల పార్టులను విప్పి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నట్టు విచారణలో బయటపడినట్టు సమాచారం. మొత్తం 14 స్నాచింగ్ కేసుల్లో కీలక భూమిక వహించిన ఇతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. అందరితో కలివిడిగా ఉండే హోంగార్డు స్నాచర్‌గా తేలడంతో ఒక్కసారిగా తోటి సిబ్బంది కంగుతిన్నారు. ఉన్నతాధికారులు సైతం విస్తుపోయారు.