పెన్షనర్లంటే ప్రభుత్వాలకు చిన్నచూపేల?
- ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌పీఎఫ్) డిమాండ్
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో ఘనంగా ఆవిర్భావ సమావేశం
- రిటైర్డ్ ఉద్యోగులు సమాజ సేవకు ఉపక్రమించాలి: జస్టిస్ నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: దశాబ్దాల పాటు ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల (పెన్షనర్ల) పట్ల చిన్నచూపు చూడటం తగదని ఆలిం డియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్‌పీఎఫ్) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. ఆదివారం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో జరిగిన ఏఐఎస్‌పీఎఫ్ ఆవిర్భావ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఆయా ప్రభుత్వాలు పెన్షనర్లను క్రమేపీ వది లించుకోవాలని చూస్తున్నాయని, 2004 తర్వా త ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పెన్షన్(సీపీఎస్) విధానాన్ని అమలు చేయడం ఇందులో భాగమేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఆరు లక్షల మంది, దేశవ్యాప్తంగా 1.58 కోట్లమంది పెన్షనర్లు ఉన్నారని.. వారు తలచుకుంటే తమ ఓటు ద్వారా ఆయా ప్రభుత్వాలను ప్రభావితం చేయగలరన్న విషయాన్ని పాలకులు గుర్తెరగాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల పెన్షనర్స్ అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు, తెలుగు రాష్ట్రాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నుంచి పెద్దసంఖ్యలో పెన్షనర్లు ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు.
సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి
సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వంలో ఒకరిగా సేవలందించిన రిటైర్డు ఉద్యోగులు తమ పెన్షన్ సమస్యలతో పాటు సమాజం ముందున్న సవాళ్లను పరిష్కరించే బాధ్యతను తీసుకోవాలని పట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు. ఎవరికి అవకాశం ఉన్న రీతిలో వారు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ.. పెన్షనర్లను గౌరవించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. తెలంగాణలో పెన్షనర్ల ఇబ్బందులను సీఎం దృష్టికి తీసికెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్‌కార్డులను అమలు చేయని ఆసుపత్రులపై కఠిన వైఖరి అవలం భించాలని ప్రభుత్వం భావిస్తోందని, నెలరోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సమావేశంలో ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ నేతలు స్వామినాథన్, పూర్ణచంద్రరావు, లక్ష్మయ్య, దూబే, రామ్మూర్తి, సుధాకర్ పాల్గొన్నారు.
హెల్త్‌కార్డులు అమలు కాకపోవడం సిగ్గుచేటు
కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై రెండేళ్లు దాటినా ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హెల్త్‌కార్డులు అమలుకు నోచుకోకపోవడం సిగ్గుచేటని ఏపీఎన్జీవో మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి అన్నారు. ఏఐఆర్‌ఎఫ్ సెక్రటరీ జనరల్ శివగోపాల్ మిశ్రా మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కుగా ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఏపీఎన్జీవో ప్రస్తుత అధ్యక్షుడు అశోక్‌బాబు మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగులకు లభిస్తున్న ప్రయోజనాలన్నీ, పెన్షనర్లకూ వర్తించేలా చేసేందుకు ఏపీ సీఎంను ఒప్పించామన్నారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లను ఐక్యం చేసేందుకు ఏఐఎస్‌పీఎఫ్ ఏర్పాటు కావడం అభినందనీయమన్నారు.