- ఈ నెల 25తో ముగియనున్న గడువు
- యూఎల్సీ భూములకు పది శాతానికి మించని దరఖాస్తులు
- బేసిక్‌వాల్యూ ప్రకారం సొమ్ము చెల్లించలేమంటున్న లబ్ధిదారులు
సాక్షి, హైదరాబాద్: పట్టణ భూపరిమితి(యూఎల్సీ) చట్టం పరిధిలోని ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువైంది. ఒకసారి డిక్లరెంట్ నుంచి కొనుగోలు చేసిన స్థలాలకు తిరిగి ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి రావడం లబ్ధిదారులు భారంగా భావిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో యూఎల్సీ స్థలాలను గుర్తించి అనుభవదారులకు నోటీసులు ఇచ్చేందుకు సమయం చాలడం లేదని రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో సుమారు 7 వేల పార్శిల్స్(స్థలాలు) ఉన్నట్లు గుర్తించారు. వాటి క్రమబద్ధీకరణ నిమిత్తం ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 10 శాతానికి మించలేదు.
యూఎల్సీ ఖాళీస్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని గత నెల 26న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పలు జీవోల ద్వారా యూఎల్సీ స్థలాల క్రమబద్ధీకరణ/ కేటాయింపు అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించిన ప్రభుత్వం, తాజా ఉత్తర్వుల మేరకు మండల తహసీల్దార్ స్థాయిలోనే ఆ ప్రక్రియను పూర్తిచేసే వెసులుబాటును కల్పించింది. ఈ నెల 25తో దరఖాస్తు గడువు ముగుస్తున్నా, ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడంతో కిందిస్థాయి అధికారులకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. మిగులు భూములను ప్రభుత్వానికి డిక్లరెంట్లు అప్పగించినా యూఎల్సీ స్వాధీనం చేసుకోకపోవడంతో వాటిని ప్లాట్లుగా ఇతరులకు విక్రయించారు. సదరు భూములను ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్(పీవోబీ)లో చూపకపోవడం, సబ్ రిజిస్ట్రార్లు ఎటువంటి అభ్యంతరం లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో ఎంతోమంది యూఎల్సీ స్థలాలను తెలిసో, తెలియకో కొనుగోలు చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు 250 గజాల్లోపు స్థలానికి బేసిక్ విలువలో 25 శాతం, 500 గజాల్లోపు అయితే 50 శాతం, ఆపైన 75 శాతం బేసిక్ విలువను చెల్లించాల్సి ఉంది. యూఎల్సీ స్థలాల క్ర మబద్ధీకరణ దరఖాస్తుతోపాటుగా రూ.2000 రుసుమును కూడా ఈ నెల 25 లోగా మీ సేవా కేంద్రంలో చెల్లించాలి.
గడువు పెంచితే మేలంటున్న అధికారులు
చాలా ప్రాంతాల్లో యూఎల్సీ స్థలాలను ఇప్పటివరకు గుర్తించలేదని, వాటిని గుర్తించి అనుభవదారులకు నోటీసులు ఇవ్వడానికి ఎంతో సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. గుర్తించిన యూఎల్సీ స్థలాల అనుభవదారుల చిరునామా మారిపోవడంతో నోటీసులను సకాలంలో వారికి చేర్చలేకపోతున్నామని చెబుతున్నారు. దరఖాస్తు గడువుకు మరింత సమయం ఇస్తే మేలని తహసీల్దార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు క్రమబద్ధీకరణ నిమిత్తం చెల్లించాల్సిన ధరను ఇంకాస్త తగ్గించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సదరు స్థలాలను కొనుగోలు చేసిన తేదీనాటి బేసిక్ విలువలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
స్థలాల క్రమబద్ధీకరణకు స్పందన కరువు
Published Mon, Jun 20 2016 12:53 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement