ఇది తుస్ చాలెంజే
- మళ్లీ మొదటికొచ్చిన ‘సింగపూర్ వ్యవహారం’
- ప్రస్తుత నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోం
- మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తాం
- హైకోర్టుకు నివేదించిన రాష్ర్టప్రభుత్వం
- రిట్ పిటిషన్, అప్పీళ్లను మూసివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: స్విస్ చాలెంజ్ వ్యవహారం అనూహ్య మలుపు తీసుకుంది. హైకోర్టు పదేపదే ఆక్షేపిస్తుండడం, అక్షింతలు వేస్తుండడంతో ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ ఆట మొదలుపెట్టింది. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని రాష్ర్ట ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. పోటీ ప్రతిపాదనలకు సంబంధించి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలపడంతో ఈ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబలింగ్ (ఏపీఐడీఈ) చట్టం 2001కు చట్ట సవరణలు చేసి ఆర్డినెన్స్ జారీ చేశామని, ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ర్టప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఈ పరిస్థితుల్లో పోటీ ప్రతిపాదనల నోటిఫికేషన్లను సవాలు చేస్తూ సింగిల్ జడ్జి వద్ద దాఖలు చేసిన రిట్ పిటిషన్లు నిరుపయోగమవుతాయని, రిట్ పిటిషన్లే నిరుపయోగమైనప్పుడు, వాటి ఆధారంగా ప్రభుత్వం, సీఆర్‌డీఏలు దాఖలు చేసి రిట్ అప్పీళ్లు కూడా నిరుపయోగమే అవుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మేర రిట్ పిటిషన్లను, అప్పీళ్లను మూసివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఏపీఐడీఈ చట్ట సవరణల ఆర్డినెన్స్, తాజా నోటిఫికేషన్ జారీకి సంబంధించి ఏజీ చేసిన నివేదనలను హైకోర్టు రికార్డ్ చేసింది. ప్రభుత్వం ఇచ్చే తాజా నోటిఫికేషన్‌పై మళ్లీ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, అప్పుడు వారు పాత రిట్ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలను తిరిగి లేవనెత్తవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నోటిఫికేషన్లపై రిట్ పిటిషన్లు...
6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజ దాని ప్రాంత అభివృద్ధి నిమిత్తం సింగపూర్‌కు చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్-సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్టియం ప్రధాన ప్రతిపాదకుడిగా స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిం ది. ఈ ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ కమిషనర్ ఆగస్టు 18న టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. హైకోర్టు జోక్యంతో గడువు తేదీని పెంచడంతో పాటు బిడ్‌ల ప్రక్రియను రెం డుగా విభజిస్తూ ఆగస్టు 28న సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, చెన్నైకి చెందిన ఎన్వియన్ ఇంజనీర్స్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
వీటిని విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని తప్పుపట్టారు. పలు అంశాల్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించారు. రెండు నోటిఫికేషన్ల అమలుపై స్టే విధిస్తూ గత నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవా లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలు వేర్వేరుగా రిట్ అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం, సీఆర్‌డీఏల తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌వాదనలు వినిపించారు. ఆదిత్య ఇన్‌ఫ్రా తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు ప్రారంభించారు.
ఈలోపే ఆర్డినెన్స్...
ఆ తరువాత దసరా సెలవులు రావడం, హైకోర్టులో బెంచ్‌లు మారడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ అప్పీళ్లు విచారణకు నోచుకోలేదు. ఈ మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐడీఈ చట్టానికి సవరణలు తీసుకొస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. సింగిల్ జడ్జి తన తీర్పులో ఏ అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారో, ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా ఆ అంశాలపై అడ్డంకులు తొలగించుకుంది. ఏపీఐడీఈ చట్టంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ అధికారాలన్నింటికీ కత్తెర వేసింది. ఇన్‌ఫ్రా అథారిటీని పూర్తిగా నామమాత్రం చేసేసింది. ఆర్డినెన్స్ సిద్ధం కాగానే తమ అప్పీళ్లపై విచారణ చేపట్టాలని అడ్వొకేట్ జనరల్ ఈ నెల 21న ధర్మాసనాన్ని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఈ నెల 26న కేసును విచారిస్తామంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23నే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
పిటిషన్లు.. అప్పీళ్లు మూసివేస్తూ ఉత్తర్వులు
చెప్పిన విధంగానే ధర్మాసనం బుధవారం అప్పీళ్లపై విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ, ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చామని తెలిపారు. పోటీ ప్రతిపాదనలకు సంబంధించి జారీ చేసిన సవరణ నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని కోర్టుకు నివేదించారు. తాజాగా నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్ నిరుపయోగమవుతుందని తెలిపారు. దీనికి ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ, ఏజీ చేసిన నివేదనలను రికార్డ్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. అంతేకాక రిట్ పిటిషన్లలో సింగిల్ జడ్జి వద్ద తాము లేవనెత్తిన అంశాలను మళ్లీ లేవనెత్తే వెసులుబాటునివ్వాలని కోరారు.
అందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన నేపథ్యంలో రిట్ పిటిషన్లు నిరుపయోగమవుతాయని తెలిపింది. అంతేకాక రిట్ పిటిషన్లలో సవాలు చేసిన నోటిఫికేషన్లపై ముందుకెళ్లబోమని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ పిటిషన్లలో విచారించడానికి ఏమీ ఉండదని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్లు నిరుపయోగమైనప్పుడు వాటి ఆధారంగా దాఖలు చేసిన అప్పీళ్లు కూడా నిరుపయోగమే అవుతాయని తేల్చి చెప్పింది. ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ ఇస్తే పిటిషనర్లు రిట్ పిటిషన్లలో లేవనెత్తిన అంశాలను తిరిగి లేవనెత్తవచ్చునంటూ వెసులుబాటు కల్పించింది. ఆర్డినెన్స్ నేపథ్యంలో రిట్ పిటిషన్లు, అప్పీళ్లను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ ఆ మేర ఉత్తర్వులు జారీ చేసింది.