ప్రత్యేక సెలవుగా సకల జనుల సమ్మె కాలం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సాధారణ సెలవు (స్పెషల్ కాజువల్ లీవ్)గా ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జేఏసీ పిలుపు మేరకు టీఎన్జీఓలు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24వ వరకు ‘సకల జనుల సమ్మె’ను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీ మేరకు ఈ సమ్మె కాలాన్ని ప్రత్యేక సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ ఉద్యోగులందరికీ దీనిని వర్తింపజేశారు. కాగా, మల్టీ జోనల్, స్టేట్ కేడర్ ఉద్యోగుల విషయంలో మాత్రం వారి తుది కేటాయింపులకు లోబడి ప్రత్యేక సెలవులను వర్తింపజేయనున్నారు.
సమ్మెలో పాల్గొన్న ఉద్యోగుల సెలవుల ఖాతాల్లో సమాన సంఖ్య గల సెలవులను పునరుద్ధరించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన తుది తీర్పులకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రిటైరైన ఉద్యోగులు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు పెన్షన్‌లో బకాయి కింద చెల్లింపులు చేయనున్నారు.