గ్యాస్ తుస్....
గ్రేటర్ హైదరాబాద్‌లో పైప్‌లైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) తుస్సుమంది. ఏడాదిగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. నేచురల్ గ్యాస్‌ను పైప్‌లైన్ ద్వారా నేరుగా వంటింటికే సరఫరా చేయాలన్న లక్ష్యంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) ప్రారంభించిన ‘సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు’ పూర్తిగా అభాసుపాలైంది. బీజీఎల్ ఆదిలో చేసిన హడావుడి ఆచరణలో లేకుండా పోవడంతో.. పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ కారు చౌకగా అందుతుందన్న నగరవాసుల ఆశలు అడియాసలయ్యాయి. 2014 ఏప్రిల్ నాటికి హైదరాబాద్‌లో లక్ష కుటుంబాలకు పీఎన్జీ అందించాలన్నది బీజీఎల్ తొలిదశ లక్ష్యం కాగా.. ఇప్పటికి కేవలం 440 కుటుంబాలకే అదిపరిమితమైంది. పైప్‌లైన్ పనుల విస్తరణ 32 కిలోమీటర్లు దాటక పోగా, కనెక్షన్లు అందించిన వినియోగదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా మోతాదుకు మించడం లేదు.
సాక్షి, సిటీబ్యూరో : ఇంటింటికీ గ్యాస్ అందించాలనే మహత్తర ఆశయం నీరుగారిపోయింది. చౌకగా గ్యాస్ ముంగిట్లోకి వస్తుందనుకున్న సీటీజనుల ఆశలు అడియాసలైపోయాయి. నగరంలో ఇంటింటీకి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ గ్యాస్ (సీఎన్జీ) అందించేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్)’ సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అయితే ఆదిలో చురుగ్గా పనులు సాగినా ఆ తర్వాత ఆగిపోయాయి.
బీజీఎల్ లక్ష్యాలివీ...
హైదరాబాద్‌లో ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ఏర్పాటు ద్వారా సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చే సేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టు సిద్ధమైనట్లు బీజేఎల్ తన అధికారిక నివేదికలో స్పష్టం చేసింది.
సుమారు రూ.3,166 కోట్లతో 20 ఏళ్లలో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాలన్నది తమ ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది.
పరిమితంగా పైప్‌లైన్ వంటగ్యాస్
నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసిన బీజీఎల్.. 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది.
తొలుత శామీర్‌పేట మదర్‌స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ వర్శిటీ క్యాంపస్‌లోగల 30 ఫ్లాట్‌లకు పీఎన్‌జీ కనెక్షన్లు అందించింది.
ఆ తర్వాత సమీపంలోని మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకూ పీఎన్‌జీ కనెక్షన్లు ఇచ్చింది.
వాస్తవంగా మేడ్చల్‌లో సుమారు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి అప్పటి సీఎం ద్వారా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ కార్యక్రమం వాయిదా పడటంతో కొన్ని కనెక్షన్లను అందించి చేతులు దులుపుకొంది.
ఆ తర్వాత కొత్త కనెక్షన్ల జోలికే వెళ్లలేదు. నగరవాసుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నప్పటికీ పైప్‌లైన్ గ్యాస్ కలగానే మిగిలిపోయింది.
అడుగు దాటని పనులు
ప్రారంభం నుంచీ పైప్‌లైన్ పనుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
గతేడాది వరకు శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 32 కిలోమీటర్ల పనులు మాత్రమే జరిగాయి.
ఏడాది కాలంగా పైప్‌లైన్ పనులను పరిశీలిస్తే ఒక అడుగు కూడా ముందుకు సాగలేదు.
మరోవైపు సుచిత్ర, కొంపల్లి, జీడిమెట,్ల బంజారాహిల్స్ మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది.
కాగా, పైప్‌లైన్ గ్యాస్ పనులపై ఏప్రిల్ తర్వాతే నిర్ణయం తీసుకొంటామని బీజీఎల్ అధికారులు పేర్కొంటున్నారు.
సీఎన్జీ కూడా అంతంతే..
మహానగరానికి పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ పురోగతి లేకుండా పోయింది.
శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినా గ్రిడ్ నుంచి గ్యాస్ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా లే దు.
వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు వినియోగించే 85వేల ఆటోలు, 7,500 బస్సులు, 20వేలకు పైగా ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల సీఎన్జీ అవసరం ఉంటుందని అంచనా వేసి మరీ సరఫరాకు బీజీఎల్ సిద్దమైంది.
ప్రాజెక్టు తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు సంబంధించిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది.
కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసినా.. ప్రసుతం 110 బస్సులకే పరిమితం చేసింది.
మిగిలిన బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి.
ప్రైవేటు వాహనాల కోసం 12 సీఎన్జీ స్టేషన్లను ఏర్పాటు చేసినా డిమాండ్‌కు తగ్గ గ్యాస్ సరఫరా కావడం లేదు.