సమ్మె విరమించండి
ఉపాధి హామీ ఉద్యోగులకు కేటీఆర్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్లామని మంత్రి పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం ఉపాధిహామీ, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) కార్యక్రమాల అమలు గురించి ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
ఉద్యోగులతో సమ్మె విరమింపజేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. పథకం అమల్లో పెరుగుతున్న నిర్వహణ వ్యయాన్ని తగ్గించే ందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ పనులపై కేంద్రం విధించిన పరిమితి గురించి రాష్ట్ర ప్రభుత్వం తరపున లేఖ రాయాలని ఆదేశించారు. పథకం అమలుకు ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్య(ప్రత్యేక సాఫ్ట్‌వేర్, సోషల్ ఆడిట్..తదితర)లను కేంద్రానికి రాసే లేఖలో పేర్కొనాలని మంత్రి సూచించారు.