హతవిధీ.. అందని ‘నిధి’! | Students in extreme agitation | Sakshi
Sakshi News home page

హతవిధీ.. అందని ‘నిధి’!

Published Sat, Jul 15 2017 1:26 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

హతవిధీ.. అందని ‘నిధి’! - Sakshi

హతవిధీ.. అందని ‘నిధి’!

ఫూలే విద్యా నిధి కింద ఎంపికైన విద్యార్థుల ఫీజు వెతలు
- విదేశీ వర్సిటీల్లో చేరిన విద్యార్థులకు ఇప్పటికీ అందని ఆర్థిక సాయం
వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో వివరాలన్నీ గల్లంతు
దీంతో మళ్లీ అప్‌లోడ్‌ చేయాల్సిన పరిస్థితి
త్వరలో ప్రారంభం కానున్న రెండో సెమిస్టర్‌
ఫీజులు కట్టాల్సి ఉండటంతో తీవ్ర ఆందోళనలో విద్యార్థులు
 
మహాత్మ జ్యోతిబా ఫూలే విద్యా నిధి పథకం కింద ఎంపికైన అనూప్‌.. ఆర్నెల్ల క్రితం ఆస్ట్రేలియాలోని ఓ వర్సిటీలో ఎమ్మెస్‌ అడ్మిషన్‌ పొందాడు. ఈ మేరకు బోనఫైడ్‌తోపాటు ప్రవేశానికి సంబంధించిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేశాడు. ఈ వివరాల ఆధారంగా ఫీజు నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఈ నెల 20న రెండో సెమిస్టర్‌ ప్రారంభమవుతుండటంతో వర్సిటీ యాజమాన్యం ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో తండ్రికి ఫోన్‌ చేసి డబ్బులు పంపించాలంటూ ఒత్తిడి తీవ్రం చేయడంతో అప్పు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.
 
సాక్షి, హైదరాబాద్‌: మహాత్మ జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ విద్యా నిధి పథకం కింద ఆర్థిక సాయం వస్తుందనే ధీమాతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్సులో ప్రవేశాలు పొంది మొదటి సెమిస్టర్‌ ముగుస్తున్నా.. ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేయకపోవ డంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తల్లిదండ్రులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఫీజు డబ్బులు సర్దుబాటు చేసి పంపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ప్రతిభావం తులైన బీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం 2016లో మహాత్మ జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌ విద్యా నిధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

ఎంపికైన లబ్ధిదారుడికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇప్పటివరకు 103 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. వీరిలో దాదాపు సగం మంది ఆర్నెళ్ల క్రితమే విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ఆయా విద్యార్థులు రెండో సెమిస్టర్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. సాధారణంగా విదేశీ వర్సిటీల్లో ఫీజుల చెల్లింపు వాయిదాల పద్ధతిలో ఉంటుంది. ఈ క్రమంలో ఓవర్సీస్‌ విద్యార్థులు తొలి విడత ఫీజును స్నేహితులు, బంధువుల వద్ద సర్దుబాటు చేసుకుని చెల్లించగా.. రెండో విడత ఫీజు చెల్లింపు సమయానికి ఆర్థిక సాయం అందుతుందని భావించారు. వారం రోజుల్లో రెండో సెమిస్టర్‌ ప్రారంభం కానుండగా సాయం అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
 
సాంకేతిక చిక్కులతో ఇక్కట్లు
బీసీ ఓవర్సీస్‌ విద్యా నిధి లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. 2 నెలల క్రితమే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కార్యాలయాలకు రూ.11 కోట్లు జమ చేశారు. లబ్ధిదా రుల ప్రవేశాలకు సంబంధించిన వివరాలు పరిశీలించి వారికి ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉండగా.. ఈ ప్రక్రియ ఇప్పటికీ ముందుకు సాగలేదు. విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు బోనఫైడ్, ఐడీ కార్డు తదితర వివరాలు ఈపాస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలా విద్యార్థులు సమర్పించిన వివరాలను పరిశీలించి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆమోదించి నిధులు విడుదల చేయాలి. అయితే ఈపాస్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది. చాలామంది విద్యార్థులు సమర్పించిన వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. మరికొందరు బోనఫైడ్, ఐడీ కార్డుల ఫొటోలను అందులో అప్‌లోడ్‌ చేసినప్పటికీ అవి చిన్న సైజులోకి మారిపోతున్నాయి. దీంతో జిల్లా సంక్షేమాధికారుల కు వీటి పరిశీలన కష్టంగా మారింది. 
 
మరోసారి పంపితేనే..
తాజాగా ఓవర్సీస్‌ అభ్యర్థుల నుంచి మరోమారు వివరాలు తెప్పించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. ఆయా విద్యార్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారాన్ని పంపనుంది. మరోవైపు వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించాలని ఇప్పటికీ సీజీజీ (సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌)ని ఆదేశించింది. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవు తుందని, అనంతరం విద్యార్థుల నుంచి వివరా లు వచ్చాక పరిశీలిస్తామని, ఈ ప్రక్రియ పూర్త య్యేందుకు 10 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈలోపు రెండో సెమిస్టర్‌ ప్రారంభం కానుండటంతో డబ్బులు చెల్లించకుంటే వర్సిటీల్లో ఇబ్బందులు  వస్తా యని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement