స్టూడెంట్ వార్! | Student's War! | Sakshi
Sakshi News home page

స్టూడెంట్ వార్!

Published Sun, Nov 30 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

స్టూడెంట్ వార్!

స్టూడెంట్ వార్!

విద్యార్థుల మధ్య పెరుగుతున్న వైషమ్యాలు
పత్తాలేని ర్యాగింగ్ నిరోధక కమిటీలు
సుప్రీం కోర్టు ఉత్తర్వులు బేఖాతర్
చేష్టలుడిగి చూస్తున్న పోలీసులు

 
అంతవరకూ సరదాగా ఉండే విద్యార్థుల మధ్య అపోహలు... చిన్నపాటి ఘర్షణలు రక్తపాతానికి దారి తీస్తున్నాయి. కళాశాలల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తున్నాయి. క్షణకాల ఆవేశం తోటి వారి ప్రాణాలను బలిగొంటోంది. తమ బిడ్డను కోల్పోయిన విద్యార్థుల తల్లిదండ్రులకే కాదు... దానికి కారకుడైన సహచరుడి కన్నవారినీ శోక సంద్రంలో ముంచుతోంది. నగరంలోని వివిధ
 కళాశాలల్లో చోటుచేసుకుంటున్న సంఘటనలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. శనివారం ప్రగతి మహా విద్యాలయ కళాశాలలో ఇదే తరహాలో హర్షవర్ధన్ అనే విద్యార్థి సహచరుడి దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
 
సిటీబ్యూరో: విజ్ఞానాన్ని పంచుతూ.. క్రమశిక్షణను అలవరచి... నైతిక విలువలను బోధించవలసిన విద్యాసంస్థలు విద్యార్థుల మధ్య ఘర్షణలు... కొట్లాటలకు కేంద్రాలుగా మారుతున్నాయి. విద్యార్థుల మధ్య తలెత్తే అభిప్రాయ బేధాలు చినికి చినికి గాలివానలా మారుతున్నాయి. తీవ్రమైన ఘర్షణలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి సంఘటనల విషయంలో విద్యా సంస్థల యాజమాన్యాలూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పోలీసులూ పెద్దగా స్పందించడం లేదు. ఫలితంగా విద్యార్థుల ప్రాణాల మీదకు వస్తోంది. కోఠిలోని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ కళాశాలలో శనివారం చోటుచేసుకున్న సంఘటన దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. విద్యార్థుల మధ్య మనస్పర్ధలను తొలగించి ఉంటే...హర్షవర్ధన్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయేవాడు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ  ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముందే స్పందించి ఉంటే...

రెండు నెలలుగా కళాశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొని ఉంది. యాజమాన్యం కానీ, అధ్యాపకులు కానీ దీన్ని నివారించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక విద్యాసంస్థలు, ఇంజినీరింగ్, ఫార్మా కళాశాలల్లో  ఇలాంటి వాతావరణమే నెలకొని ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ధనార్జనే ధ్యేయంగా విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. విద్యార్థుల మధ్య వైషమ్యాలను ఎప్పటికప్పుడు పరిష్కరించే వ్యవస్థ, యంత్రాంగం లేకపోవడం, వారి సమస్యలను అధ్యాపకులు పట్టించుకోకపోవడం వల్ల వాతావరణం దెబ్బ తింటోంది. మరోవైపు ఇలాంటి సమస్యలకు కారణమవుతున్న ర్యాగింగ్ నిరోధంపైనా దృష్టి పెట్టడం లేదు.
 
కమిటీలు ఏవీ?

 ఫీజుల వసూలుపై కళాశాలలకు ఉన్న శ్ర ద్ధ విద్యార్థుల ప్రవర్తన, సమస్యల విషయంలో కనిపించడం లేదు. అన్ని కళాశాలల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. కమిటీలను ఏర్పాటు చేయని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను అరెస్టు చేసే అధికారం పోలీసులకు సుప్రీం కోర్టు ఇచ్చింది. ఇదంతా కాగాతాలకే పరిమితం. ఫలితంగా తరచూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

తల్లిదండ్రుల బాధ్యత

ఈ పరిస్థితికి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసిందే. కళాశాలలో ఏ విద్యార్థితోనైనా గొడవలు, మనస్పర్ధలు, వైషమ్యాలు ఉన్నాయా? అనే విషయమై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. ఏదైనా సమస్య ఉంటే తల్లిదండ్రులకు చెప్పుకునే ధైర్యం పిల్లల్లో కల్పించాలి. వెంటనే కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్‌లను కలిసి పరిష్కరించుకోవాలి. అలాంటి చొరవ తల్లిదండ్రుల వైపు నుంచి కనిపించడం లేదు.

గతంలో జరిగిన సంఘటనలు

గత ఏడాది జూన్‌లో మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న సినీ నటుడు నిఖిల్ సోదరుడు రోహిత్‌సిద్ధార్థపై సీనియర్ విద్యార్థులు హరికృష్ణ, లక్ష్మణ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డిలు క్యాంటిన్‌లో దాడి చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 10న దుండిగల్‌లోని ఓ మేనేజ్‌మెంట్ కళాశాలలో ఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ కుమార్ అనే విద్యార్థి అదే కళాశాలకు చెందిన హేమంత్, సురేష్‌ల ర్యాగింగ్ భరించలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
     
రెండేళ్ల క్రితం ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న శంకర్‌పల్లికి చెందిన అజయ్‌గౌడ్‌పై సీనియర్లు దాడి చేశారు.  గత ఏడాది మార్చి 22న పేట్‌బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న సంతోష్, అబ్దుల్‌లను సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు.

ర్యాగింగ్ నిరోధక కమిటీ

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రతి కళాశాలలోనూ ర్యాగింగ్ నిరోధక కమిటీనిఏర్పాటు చేయాల్సిందే. ఈ కమిటీలో స్వచ్ఛంద సంస్థ, పోలీసు శాఖ, కళాశాల నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మానసిక నిపుణులు ఒక్కొక్కరు చొప్పున ఉంటారు. వీరిని సమన్వయపరిచి కమిటీ ఏర్పాటు చేసే బాధ్యత కళాశాలపైనే ఉంటుంది.

యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్

యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. విద్యార్థుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. తరగతి, హాస్టల్ గదులు, లైబ్రరీ, క్యాంటిన్, బస్సులు, బస్ స్టాప్‌లలో నిఘా పెడుతుంది. ర్యాగింగ్‌కు అవకాశాలు ఉన్న ప్రతి చోటా ఈ స్క్వాడ్ పరిశీలిస్తుంది. యాంటీ ర్యాగింగ్ కమిటీల తీరుతెన్నులను అధ్యయనం చేస్తుంది.

ప్రతిజ్ఞ చేయించాలి...

కళాశాలలో చేరే ప్రతి విద్యార్థి ర్యాగింగ్ నిరోధానికి ప్రతిజ్ఞ చేయాలి. లిఖిత పూర్వకంగా ఒక నోట్‌ను కళాశాల నిర్వాహకులకు అందజేయాల్సి ఉంటుంది. నోట్ ఇవ్వని విద్యార్థికి కళాశాలలో చేర్చుకోరు.
 
 
కళాశాల యాజమాన్యాలు ర్యాగింగ్‌కు సంబంధించిన పోస్టర్లతో పాటు కరపత్రాలు, ర్యాగింగ్ చట్టం పత్రాలు నోటీసు బోర్డులో పెట్టాలి.
అలా పెట్టని కళాశాలలపై చర్యలు తీసుకునే అవకాశం సుప్రీంకోర్టు పోలీసులకు కల్పించింది.
►  ఇలాంటి కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను అరెస్టు చేయవచ్చు.
►  ర్యాగింగ్‌కు పాల్పడితే విధించే శిక్షలను ప్రతి విద్యార్థికీ కళాశాల యాజమాన్యం వివరించాలి.
►  ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు ముందుగా కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకె ళ్లాలి.
►  ఇలాంటి ఫిర్యాదుపై కళాశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు తెలియజేయాలి.
►  ర్యాగింగ్ విషయాన్ని దాచిపెట్టినా, సహకరించినా యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
  అలాంటి కళాశాలలపై కేసు నమోదు చేస్తారు.

ర్యాగింగ్ అంటే...

     బలవంతంగా విద్యార్థితో పనులు చేయించడం
   అశ్లీల చిత్రాలు చూపడం, అసభ్య ప్రశ్నలు వేయడం
    బట్టలు ఊడదీయడం
     బట్టలు ఉతికించడం
     కాళ్లు మొక్కించుకోవడం
     నోట్స్ రాసిపెట్టమని బలవంతం చేయడం
►  అసభ్యంగా ప్రవర్తించమని చెప్పడం
     వేధింపులకు గురిచేయడం
     {పాణం పోవడానికి, ఆత్మహత్యకు ప్రేరేపించడం
     
ఇతరత్రా వే ధింపులు.

 
►  ర్యాగింగ్‌కు పాల్పడితే....
►  నేరం తీరు    శిక్ష
►  టీజింగ్    6 నెలలు జైలు
►  కొడితే    ఏడాది జైలు (రూ.5 వేలు ఫైన్)
►  బంధించడం    రెండేళ్ల జైలు
కిడ్నాప్, రేప్    5 ఏళ్ల జైలు (రూ.10వేలు ఫైన్)
►  ర్యాగింగ్‌లో చనిపోతే..
  జీవిత కాలం శిక్ష (పదేళ్ల జైలు, రూ 50 వేల ఫైన్)
 
మొదటి మూడు నేరాలకు పాల్పడిన విద్యార్థిని కళాశాల నుంచి సస్పెండ్ చేస్తారు. చివరి నేరానికి పాల్పడితే ఏకంగా డిస్మిస్ చేస్తారు. అంటే ఇతర ఏ కళాశాలలోనూ విద్యార్థిని చేర్చుకోరు.
 
 
సూడో హీరోయిజానికి నిదర్శనం


 సినిమాల ప్రభావం యూత్‌పై బాగా ఉంది. టీనేజ్ విద్యార్థులు సినిమాల ప్రభావం, హార్మోన్‌ల కారణంతో సూడో హీరోయిజానికి పాల్పడుతున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులు, విద్యాసంస్థలపైఉంది. చిన్న వయస్సులో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి వాటికి పిల్లలు అలవాటు పడుతున్నారు. దాంతో క్షణికమైన ఉద్రేకాలు, భావోద్వేగాలు, హింసను ప్రేరేపించే ఆలోచనలు పిల్లల్లో చెడు లక్షణాలకు దారి తీస్తున్నాయి.

 - డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మానసిక వైద్య నిపుణుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement