
న్యూఢిల్లీ: జూలై నెల ప్రవేశించినా దేశంలో ప్రజలకు కోవిడ్ టీకాలు అందుబాటులోకి రాలేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మండిపడ్డారు. అజ్ఞానం అనే వైరస్‌కు టీకా లేదంటూ ఆయన తిప్పికొట్టారు. ‘జూలై నెల వచ్చేసింది. కోవిడ్ టీకాలు ఇంకా రాలేదు. ఎక్కడ వ్యాక్సిన్లు’ అంటూ రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.
దీనిపై మంత్రి హర్షవర్ధన్ స్పందిస్తూ..‘దేశంలో ఈ నెలలో వ్యాక్సిన్ల అందుబాటును వివరిస్తూ గురువారం గణాంకాలను విడుదల చేశాను. రాహుల్ సమస్యేంటో అర్థం కావడం లేదు. ఆయనకు చదవడం రాదా? అర్థం చేసుకోలేడా? అజ్ఞానం అనే వైరస్‌కు వ్యాక్సిన్ లేదు. నాయకత్వ సమగ్రతపై కాంగ్రెస్ పార్టీ తప్పక ఆలోచించాలి’ అంటూ చురకలంటించారు. 51 జూలైలు(రాహుల్ వయస్సు 51) వచ్చినా ఆయనకింకా పరిణతి, బాధ్యత, తెలివి ఎందుకు రాలేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని బీజేపీ ఎద్దేవా చేసింది.