న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణతో మొత్తం ప్రపంచమే బెంబేలెత్తిపోతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాడి కింద పారేశారని, కరోనా నియంత్రణ బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించి, చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు. కరోనా మొదటి దశపై విజయం సాధించామని గొప్పలు చెప్పుకున్న మోదీ ఇప్పుడు రెండో దశలో వైరస్ ప్రతాపం చూపుతుండగా, ఎందుకు నోరు మూసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘‘మిమ్మల్ని మీరే కాపాడుకోండి. మీకు ఎవరూ సాయం చేయరు. ఆఖరికి ప్రధానమంత్రి కూడా’’ అని కరోనా బాధితులకు సూచించారు. కరోనాపై ప్రభుత్వం నియంత్రణ కోల్పోయిందన్నారు. ఆత్మనిర్భర్ అంటే ఎవరికి వారు రక్షించుకోవడమేనా? అని నిలదీశారు. కోవిడ్–19 మహమ్మారిపై నిపుణులు, సైంటిస్టులు మొదటినుంచి హెచ్చరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. పరిస్థితిని అర్థం చేసుకొని, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యిందన్నారు.
పార్టీ ఆదేశాలను శిరసావహిస్తా...
దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నా లెక్కచేయకుండా ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారని రాహుల్ గాంధీ ఆరోపించారు. కరోనా వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలను ప్రోత్సహించారని విమర్శించారు. సభల్లో వారు కనీసం మాస్కు కూడా ధరించలేదని తప్పుపట్టారు. దీన్నిబట్టి వారు ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో చెప్పాలన్నారు. కరోనా వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. పరిస్థితి చేయి దాటిపోతున్నా ప్రధాని మోదీ సొంత ప్రతిష్ట పెంచుకొనే ప్రయత్నాలు చేశారనిమండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎన్నికల పట్ల రాహుల్ సానుకూలత వ్యక్తం చేశారు. పార్టీకి ఎవరు సారధ్యం వహించాలన్నది కార్యకర్తలే నిర్ణయిస్తారని చెప్పారు. పార్టీ ఆదేశాలను తాను శిరసావహిస్తానని చెప్పారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం అవసరమే అయినప్పటికీ ప్రస్తుతానికి కరోనా వైరస్ నియంత్రణ, ప్రజల ప్రాణాలను కాపాడడంపైనే దృష్టి పెట్టాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment