సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంతో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకుల్లో కల్లోలం మొదలైంది. ఇంతకాలం అడ్డుకుంటాం.. ఆపేస్తాం.. నోట్ రాకుండా ఒత్తిడి చేస్తామంటూ మాటలు చెబుతూ కాలయాపన చేసిన సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. గురువారం కేంద్ర మంత్రిమండలి ముందుకు కేంద్ర హోం శాఖ రూపొందించిన తెలంగాణ నోట్ రాబోతోందన్న వార్తలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రోజంతా సమాలోచనలు జరిపారు. మంత్రుల క్వార్టర్లలోని క్లబ్‌హౌస్‌లో సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఆ సమావేశం ముగిసిన సమయానికే తెలంగాణ నోట్ కేంద్ర కేబినెట్ ముందుకురావడం, దాన్ని ఆమోదించడమూ జరిగిపోయాయి. దీంతో కేంద్రం నిర్ణయంపై సీమాంధ్ర మంత్రులు, నేతలు మరోసారి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. అయితే రెండోసారి భేటీలో సీఎం వద్దకు సీనియర్ మంత్రులెవ్వరూ రాకపోవడం గమనార్హం.
సీఎం గ్రూపుగా ముద్రపడ్డ గంటా శ్రీనివాసరావు, శైలజానాథ్, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, పార్థసారథి తదతరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ నిర్ణయంపై చర్చించారు. కేంద్ర కేబినెట్ తీర్మానం రాష్ట్రపతికి వెళ్లి అక్కడినుంచి అసెంబ్లీ అభిప్రాయానికి రావాలి. అప్పుడు ఎలా వ్యవహరించాలి? ఈలోగా ఎలాంటి కార్యాచరణను చేపట్టాలి? సీమాంధ్రలో ప్రజలకు ఏం సమధానం చెప్పాలన్న అంశాలపై తర్జనభర్జనలు సాగించారు. రాజీనామాలు చేయడం వల్ల ఫలితం ఉండదని, అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించి ఆ తరువాత అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని సీఎం మరోసారి చెప్పారని సమాచారం. అసెంబ్లీలో ఎక్కువ మంది సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకించి పంపిస్తే పార్లమెంటులో దానిపై చర్చ జరుగుతుందని, ఎక్కడో ఒకదగ్గర బ్రేక్ పడుతుందన్న అభిప్రాయం మరికొందరు వినిపించారని సమాచారం. అంతకు ముందు కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ గురించి ఉదయం నుంచే వార్తలు రావడంతో కాంగ్రెస్ సీమాంధ్ర నేతల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. కేబినెట్ నోట్ ఆలస్యం కావడానికి తాము చేసిన ఒత్తిడే కారణమని, విభజన సమస్యలపై స్పష్టమైన పరిష్కారం లభించే వరకు నోట్ రాకుండా అడ్డుకుంటామని కేంద్రమంత్రులు, ఎంపీలు ప్రకటిస్తూ వచ్చారు. అందుకోసమే తాము రాజీనామాలు చేసినట్లూ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వారి ప్రకటనలకు భిన్నంగా నోట్ కేబినెట్ ముందుకు వచ్చింది.
మంత్రుల నివాస ప్రాంగణంలో జరిగిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఈ అంశంపై తీవ్ర చర్చ సాగింది. రాజీనామాలు చేయాలా? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి. కాంగ్రెస్సే విభజన చేస్తున్నట్లుగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నందున దాన్ని ఎలా చల్లార్చాలి. పార్టీలోనే ఉంటూ సమైక్యపోరాటం సాగించడం తదితర అంశాలపై వాడివేడి చర్చ సాగింది. చివరికికి పార్టీని వీడకుండానే సమైక్యపోరాటం సాగించాలన్న అభిప్రాయానికి వచ్చారు. ఎమ్మెల్యేలు కొందరు అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరచగా మంత్రులు దానిపై అభ్యంతరం చెప్పారు. పార్టీని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మరోసారి అధిష్టానానికి స్పష్టంచేయాలని, అసెంబ్లీకి తీర్మానం వస్తే పార్టీ సీమాం ధ్ర ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించాలని నిర్ణయించారు. సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స స త్యనారాయణల ద్వారా అధిష్టానానికి తెలియచేయాలని నిర్ణయించారు. సమావే శంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, వట్టి వసంతకుమా ర్, సి.రామచంద్రయ్య, టీజీ వెంకటేశ్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాసు కృష్ణారెడ్డి, అహ్మదుల్లా, గల్లా అరుణ, శైలజానాథ్, తోట నర్సింహం, గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళీమోహన్, పార్థసారథి, శత్రుచర్ల విజయరామరాజు పాల్గొన్నారు.
నేతలు మభ్యపెట్టారా?
రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర, రాష్ట్ర మంత్రులపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు, ఆ ప్రాంత కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన కానేకాదని తమను మోసపుచ్చే మాటలతో వంచించారని మండిపడుతున్నారు. ‘‘తెలంగాణ చాలా జఠిలమైంది. రాష్ట్ర విభజన అంత సులభం కాదు. నోట్ తయారీ ఇప్పట్లో కాదు. కేబినెట్ ముందుకు రానేరాదు’’ అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గత కొంత కాలంగా చేస్తున్న ప్రకటనలను గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తథ్యమని కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కేంద్రప్రభుత్వంలోని ముఖ్యులు ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రులకు, ఎంపీలకు ముందునుంచే సంకేతాలు ఇచ్చారు. కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనే సీమాంధ్రలోని ఎనిమిది మంది నేతలకు మంత్రి పదవులు కట్టబెడుతున్న సందర్భలో కూడా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని, దానికి సహకరించాలని షరతు విధించి మరీ కేబినెట్లోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ తరువాత కోర్ కమిటీ, సీడబ్ల్యూసీలో చర్చలన్నీ కేవలం కంటితుడుపు చర్యల్లో భాగంగానే చేపట్టినట్లుగా ఇపుడు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోర్ కమిటీ సమావేశానికి ముందు రోడ్ మ్యాప్‌లు తీసుకురావాలని కేంద్రం పెద్దలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎంలకు సూచించడం కూడా కేవలం ఏదో చర్చిస్తున్నామని అనిపించుకోవడానికేనని ఇప్పుడు తేటతెల్లమవుతోందని మండిపడుతున్నారు. తెలంగాణపై కేంద్రం వేసే ప్రతి అడుగు ముఖ్యమంత్రికి, కేంద్రమంత్రులకు ముందుగానే తెలుసునని, కానీ ఏమీ జరగడం లేదని, జరగబోదని తమను చివరి వరకు మభ్యపెట్టారని వారు మండిపడుతున్నారు. కేంద్రం, ఢిల్లీ పెద్దలు రాష్ట్ర విభజన సాఫీగాసాగిపోయేలా చేసేందుకే చివరి వరకు సీఎం తమను భ్రమల్లో ఉంచారని, ఇది కావాలనే చేశారా? ఇంకేమైనా కారణముందా? అన్న అనుమానాలు నేతల్లో ఏర్పడుతున్నాయి.