నిఘా నీడలో ఈస్ట్‌జోన్
ముఖ్యమైన జంక్షన్లు, పార్కులు, ఆలయాల వద్ద నిఘానేత్రం
753 కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన
ఇప్పటికే 531 బిగింపు
తగ్గిన స్నాచింగ్‌లు-పెరిగిన రికవరీలు
సిటీబ్యూరో: లండన్ తరహా సీసీ కెమెరా వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నట్లుగానే ఈస్ట్ జోన్ పోలీసులు అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈస్ట్‌జోన్ డీసీపీ పరిధిలోని తొమ్మిది పోలీసుస్టేషన్ల పరిధిలో ముఖ్యమైన పార్కులు, జంక్షన్లు, ఆలయాలు, షాపింగ్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేయనున్న కెమెరాల నివేదికను డీసీపీ రవీందర్‌కు ఆయా స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు సోమవారం అందజేశారు. ఇక జోన్ పరిధిలో ఏ చిన్న నేరం జరిగినా నిందితులను క్షణాల్లో గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జోన్ పరిధిలో మొత్తం 753 కెమెరాలు ఏర్పాటు చేయడానికి రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు తయారయ్యాయి. నిన్నటి వరకు 531 కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని డీసీపీ ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటులో సుల్తాన్‌బజార్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో నల్లకుంట ఉంది. ఈ రెండు ప్రాంతాలు అత్యంత కీలకమైనవి కావడంతో ఎక్కువ కెమెరాలు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా స్నాచింగ్‌లు తగ్గుముఖం పడతాయని అధికారుల అంచనా.
ఈ ఏడాది తగ్గిన స్నాచింగ్ కేసులు
మూడేళ్ల స్నాచింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది 25 శాతం వరకు తగ్గాయి. మూడేళ్లలో మొత్తం 536 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 302 కేసులు పరిష్కారమయ్యాయి. అంతేకాకుండా రికవరీల శాతం కూడా ఈ ఏడాది పెరిగింది. మలక్‌పేట డివిజన్ పరిధిలోనే ఎక్కువ స్నాచింగ్‌లు జరిగాయి.
నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే...
నేరం చేయాలంటే దడ పుట్టేలా జోన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీలో భాగంగా సీసీ కెమెరాలకు అత్యధిక ప్రాధానం కల్పించాం. స్కూళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ సెంటర్ల యాజమాన్యాలు సహకారం ఉంటేనే ఈ ప్రయోగం విజయవంతమవుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
- డీసీపీ రవీందర్